తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ..తుడా నిధుల గోల్‌మాల్ వ్యవహారం తిరుపతి జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం తుడాను అడ్డంగా దోచుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా..దమ్ముంటే తన తప్పు తేల్చండి..అంటూ సవాళ్లు విసురుతూ వచ్చారు చెవిరెడ్డి. సరిగ్గా ఇదే టైమ్‌లో తుడా నిధులపై విజిలెన్స్ విచారణ స్పీడప్ అయింది.
సేమ్‌టైమ్ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఎన్నికల ముందు వివిధ మార్గాల నుంచి మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పొందారని సిట్ ఆరోపిస్తోంది. చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డిని కూడా సిట్ విచారణకు పిలిచింది. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లారు. ఓ వైపు లిక్కర్ కేసులో ఇబ్బందులు ఫేస్ చేస్తున్న చెవిరెడ్డి కుటుంబానికి తుడా నిధులపై విజిలెన్స్ దర్యాప్తు తలనొప్పిగా మారింది.
తుడా నిధులను మిస్ యూజ్ చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ లీడర్లు. ఐదేళ్ల వైసీపీ హయాంలో తుడాపై పెత్తనం అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే. ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే పదవితో పాటు తుడా ఛైర్మన్‌గాను కొనసాగారు. ఆ తర్వాత తాను తప్పుకొని తుడా ఛైర్మన్ పదవి తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కట్టబెట్టారు. చెవిరెడ్డి కుటుంబ పాలనలో తుడా అవినీతిమయం అయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.
అన్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చాక తుడాలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయితే తుడాకు సంబంధించిన దాదాపు 300 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయన్నది ప్రధాన ఆరోపణ. కోట్లాది రూపాయల తుడా నిధులను ఎంపీడీవోల ఖాతాలకు మళ్ళించి వారి ద్వారా ఇష్టారాజ్యంగా ఖర్చు చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపణలు
చెవిరెడ్డి కుటుంబం తుడాను జేబు సంస్థగా మార్చుతుందని అలిగేషన్స్ చేస్తున్నారు. కమిషన్ల కోసమే తుడా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేశారని, చెవిరెడ్డి కుటుంబీకులే తుడా కాంట్రాక్టులు దక్కించుకొని అక్రమంగా సొమ్ము చేసుకున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపిస్తున్నారు.
అయితే తుడా నిధుల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లైట్ తీసుకుంటూ వచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే సమయంలో ఆయన లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఓ వైపు లిక్కర్ కేసును ఫేస్ చేస్తున్న చెవిరెడ్డికి..తుడా వ్యవహారం కూడా కష్టాలు తెచ్చిపెట్టొచ్చన్న టాక్ వినిపిస్తోంది. తుడా నిధుల గోల్‌మాల్‌పై విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం కేసులు పెట్టే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే అటు లిక్కర్..ఇటు తుడా కేసుల్లో..చెవిరెడ్డి కోర్టులు, జైలు చుట్టే తిరగాల్సి వస్తుందని అంటున్నారు టీడీపీ నేతలు. తుడా నిధుల వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.