కృష్ణా జిల్లా నుంచి శాసన మండలికి వెళ్లేదెవరు? పార్టీకి దక్కే నాలుగు సీట్లలో ఛాన్స్ ఎవరికి?

ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్, ఎమ్మెల్సీగా రాజేంద్రప్రసాద్ ఉండటంతో గొట్టిపాటి ఆశలు ఇప్పటివరకు నెరవేరలేదు.

Chandrababu Naidu

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా ఐదు సీట్లు కూటమికే దక్కనున్నాయి. అందులో ఓ సీటు జనసేనకు కన్ఫామ్ చేశారు. నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మరో సీటు బీజేపీ అడుగుతున్నట్లు చెబుతున్నారు. బీజేపీకి ఇవ్వకపోతే టీడీపీకి నాలుగు సీట్లు దక్కనున్నాయి.

ఆ నాలుగు బెర్తుల కోసం కృష్ణాజిల్లా నుంచే ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు. ఈ ముగ్గురిలో ఒకరికి ఎమ్మెల్సీ బెర్త్ దక్కడం అయితే పక్కా. కానీ అదృష్టం దక్కేదెవరికి అనేదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. సామాజిక సమీకరణలే కాకుండా కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నేతలుగా ఈ ముగ్గురికి గుర్తింపు ఉంది.

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి, ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఎమ్మెల్సీ ఆశావహుల్లో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన సీటు త్యాగం చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్ష బాధ్యతను చూసిన ఉమాకు మైలవరం కాకపోయినా పెనమలూరు, గన్నవరం టికెట్ అయినా వస్తుందని అనుకున్నారు ఆయన అనుచరులు.

కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు అధిష్టానం. పార్టీ పవర్‌లోకి వచ్చాక కూడా తనకు సముచిత స్థానం దక్కడం లేదని ఉమా సైలెంట్‌గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఉమాకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

బుద్ధా వెంకన్నకు?
బుద్ధా వెంకన్న వైసీపీ దాడులను ఎదుర్కొని విజయవాడలో పార్టీ బలోపేతం కోసం శ్రమించిన నేతగా గుర్తింపు పొందారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై గళమెత్తారు. దీంతో ఆయనపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 37 కేసులు బుక్కయ్యాయి. విజయసాయిరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలకు గట్టిగా కౌంటర్లు ఇస్తూ వైసీపీని ఎదుర్కొంటూ వచ్చారు.

టీడీపీ ఆఫీస్‌, చంద్రబాబు ఇంటిపై దాడి సందర్భంలోనూ వైసీపీ నేతలకు ఎదురుగా నిలబడి తలపడ్డారు బుద్దా వెంకన్న. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయనపై దాడి జరిగింది. అలా ఎన్టీఆర్ జిల్లాలో బలమైన బీసీ నాయకుడిగా ఉన్న బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలోని మరో ప్రధానమైన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన ఆ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు వంగవీటి రాధా. వంగవీటి మోహన్‌రంగా వారసుడిగా కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నేతగా గుర్తింపు ఉన్న రాధాను..ఈసారి తప్పుకుండా ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

కృష్ణాజిల్లాలో ఈ ముగ్గురితో పాటు మరో ఒకరిద్దరు పేర్లు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తున్నాయి. పెడన నియోజకవర్గంలో బూరగడ్డ వేదవ్యాస్‌కు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ నాయకత్వం అప్పట్లో చెప్పింది. దీంతో ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి వస్తుందని వస్తుందని ఆశిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌కు ఎప్పుడూ నిరాశే ఎదురవుతోంది.

ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్, ఎమ్మెల్సీగా రాజేంద్రప్రసాద్ ఉండటంతో గొట్టిపాటి ఆశలు ఇప్పటివరకు నెరవేరలేదు. న్యాయవాదిగా పార్టీ నేతల కేసులను వాదిస్తుండటంతో కొన్ని జిల్లాలకు పరిశీలకుడిగా వేశారు. పార్టీలో సీనియర్‌గా ఉన్న గొట్టిపాటి పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తోంది. ప్రధానంగా ఆ ముగ్గురు నేతల్లో అవకాశం దక్కేదెవరికో మరో ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది.