అన్నా రాంబాబు, మాగుంట మధ్య దూరం ఎందుకు పెరిగింది.. విభేదాలకు కారణమేంటి?

ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పలుసార్లు గిద్దలూరులో పర్యటించడం, స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నారాంబాబుకు కోపాన్ని తెప్పించాయి.

Why Anna Rambabu want to defeat Magunta Sreenivasulu Reddy

Anna Rambabu: ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మాగుంటను ఓడించి తీరుతానని అన్నా రాంబాబు అనడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు వారిద్దరి మధ్య విభేదాలకు కారణమేంటనేదానిపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.

ప్రకాశంజిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నారాంబాబు ముక్కుసూటి వైఖరితో రాజకీయాల్లో దూసుకుపోయారు. కాంట్రాక్టర్‌గా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించిన అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యంలో చేరారు. పీఆర్‌పీ గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన అన్నా రాంబాబు 2019లో వైసీపీ కండువా కప్పుకుని గిద్దలూరులో సంచలన విజయం నమోదుచేశారు. 82 వేల పై చిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఎక్కువ మెజార్టీతో గెలిచిన రెండో నేతగా నిలిచారు.

వైసీపీలో ఇమడలేకపోయిన రాంబాబు
అయితే వైసీపీలో అనుకున్నస్థాయిలో అన్నా రాంబాబు ఇమడలేకపోయాడు. తన అనుచరవర్గం, తొలినుంచీ వైసీపీతో ఉన్న కార్యకర్తలకు మధ్య సమన్వయం సాధించలేకపోయారు. దీంతో అసంతృప్తులు పెరిగిపోయాయి. రీజనల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని అన్నా రాంబాబు, అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో అన్నారాంబాబుకు మరోసారి సీటు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము సహకరించేది లేదని రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసీపీ అధిష్టానానికి తేల్చిచెప్పారు.

Also Read: బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబు, డీకే శివ కుమార్ ముచ్చట్లు

ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పలుసార్లు గిద్దలూరులో పర్యటించడం, స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నారాంబాబుకు కోపాన్ని తెప్పించాయి. 2019 ఎన్నికల తర్వాత ఆర్థిక లావాదేవీల విషయంలో మాగుంట శ్రీనివాసులరెడ్డికి, అన్నారాంబాబుకు మధ్య విభేదాలు తలెత్తి దూరం పెరిగింది. పార్టీలో తన వ్యతిరేకులను ఎంపీ ప్రోత్సహిస్తున్నారన్న భావనలో అన్నా ఉన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

Also Read: జగన్ దూకుడు.. ఒకేసారి 175 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన..‍!

ఎన్నికల్లో పోటీకి దూరం
అయితే ఇదే సమయంలో అన్నా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన అన్నా రాంబాబు అసలు ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఓడించేందుకు తాను ప్రచారం చేస్తానని చెప్పడంతో.. ఎమ్మెల్యే,ఎంపీల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరాయన్న విషయం అందరికీ అర్ధమయింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ అధిస్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నా రాంబాబు, మాగుంట విభేదాలను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు