అన్ని ఆరోపణలు, విమర్శలు ఓ ఎత్తు..శ్రీవారి లడ్డూ వివాదం ఇంకో ఎత్తు. ఏ విమర్శ వచ్చినా ఓకే. బట్ కోట్లాది మంది సెంటిమెంట్‌గా ఉన్న తిరుమల శ్రీవారి లడ్డూ..అపవిత్రం అయిందన్న ఇష్యూ వైసీపీని, వైఎస్ జగన్‌ను డిఫెన్స్‌లో పడేసింది. ప్రెస్‌మీట్లు పెట్టి చెప్తున్నా..తమకేం సంబంధం లేదని వివరణ ఇస్తున్నా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
ఎంతకూ నెయ్యి మరకపోయేలా లేదు. దీంతో ఏకంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి లడ్డూ వివాదానికి చెక్ పెట్టాలని స్కెచ్ వేశారు మాజీ సీఎం జగన్. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమలకు భారీ ర్యాలీగా వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇంతలోనే తిరుపతిలో 30 యాక్ట్ అమలులోకి తెచ్చారు పోలీసులు. దీంతో ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదని గేర్ మార్చారు.
అంతేకాదు శ్రీవారి దర్శనానికి ముందు జగన్ డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలన్న డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. అటు హిందూ సంఘాలు, ఇటు కూటమి నేతలు గళం పెంచారు. ఈ పరిస్థితుల్లో తిరుమలకు వెళ్లిన తర్వాత డిక్లరేషన్‌పై సంతకం చేసినా, చేయకపోయినా ఇష్యూ మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. శ్రీవారిని దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేస్తే గతంలో ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదన్న ప్రశ్నలు వస్తాయి. డిక్లరేషన్‌పై సంతకం చేయకపోతే కూడా తిరుమల సాంప్రదాయాన్ని, హిందూ దేవుళ్లను జగన్ గౌరవించడం లేదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటూ చూసినా అది తమకే నష్టమని ఆలోచించిన జగన్ తిరుమల టూర్‌ను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ మాటల్లో బయటపెట్టిన జగన్
తిరుమల టూర్‌ను రద్దు చేసుకున్న జగన్..ప్రెస్‌మీట్ పెట్టి సీఎం చంద్రబాబుతో పాటు కూటమి సర్కార్‌పై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. తన మతం మానవత్వమని.. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా..బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తా.. హిందూ మతం ఆచారాలను పాటిస్తా..ఇస్లాం, సిక్కు మతాల సంప్రదాయాలను గౌరవిస్తానంటూ చెప్పుకొచ్చారు.
ఈ మాటల్లోనే జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లలేదో అర్థం అవుతోంది. ఇప్పటికే లడ్డూ వివాదం మీద రచ్చ జరుగుతోంది. ఇప్పుడు తన మతం, డిక్లరేషన్ లొల్లి మొదలవుతుందని జాగ్రత్త పడ్డారు జగన్. పైగా చంద్రబాబే తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని..బీజేపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటుందంటూ ఎదురు ప్రశ్నించారు.
చంద్రబాబును కార్నర్ చేయడమే బెటరా?
నిజానికి లడ్డూ వివాదం వైసీపీని డైలమాలో పడేసింది. వైఎస్ జగన్ నుంచి వైసీపీ నేతల వరకు అందరూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అది అంతబలంగా ప్రజల్లోకి వెళ్లలేదు. చివరకు వాస్తవాలేంటో తేల్చాలని ప్రధాని మోదీకి లెటర్ కూడా రాశారు జగన్. పలువురు వైసీపీ నేతలు సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని భావిస్తోంది వైసీపీ. ఈ విషయంలో చంద్రబాబును కార్నర్ చేయడమే బెటరనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఎదురుదాడి ద్వారా ప్రజల మూడ్‌ను చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్.
ఇంతలోనే తిరుమల టూర్ పెట్టుకుని.. రేణిగుంటలో భారీ స్వాగతం.. తిరుపతి పట్టణంలో ర్యాలీకి ప్లాన్ చేశారు. హంగామా చేయాలన్న ప్లాన్‌కు పోలీసుల ఆంక్షలు అడ్డొచ్చాయి. ఈ పరిస్థితులు సాదాసీదాగా శ్రీవారి దర్శనానికి వెళ్తే వచ్చే మైలేజ్ ఎంత.? ప్రస్తుత సిచ్యువేషన్‌లో తిరుమలకు వెళ్లడం బెటరా? కాదా? అని బేరీజు వేసుకుని టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు జగన్. ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు మీద ఎదురుదాడి చేశారు. నెయ్యి మరకను పోగొట్టుకోవాలంటే ..లడ్డూ ఇష్యూపై మీడియా ద్వారా ఎప్పటికప్పుడు స్పందించడమే బెటర్ జగన్ డిసైడ్ చేసుకున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదు: చంద్రబాబు కామెంట్స్