భార్య, కూతుర్ని చంపేసి సూసైడ్‌గా ప్లాన్.. వివాహేతర సంబంధమే కారణం?

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిందని కట్టుకున్న భార్యను, కన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. యర్రగొండపాలెంలోని అంబేడ్కర్ నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. హత్యలు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులకు సమాచారం అందింది.
స్థానిక ప్రైవేట్ డైరీలో పాలుపట్టే వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న కె.ముసలయ్య భార్య రేష్మ(21), కుమార్తె సమీరా(3)లను హత్యచేసి ఆత్మహత్య కింద చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు చీర కట్టి ఉరివేసుకున్నారని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు.
రేష్మను పుల్లలచెరువుకు చెందిన కె.ముసలయ్యకు ఇచ్చి 2016లో పెళ్లి చేశారు. కట్నం కింద రూ.80 వేలు, ఆ తర్వాత రూ.20 వేలు ఇచ్చామని మృతురాలి తండ్రి డి.హుస్సేనయ్య తెలిపాడు. ఏడాదిన్నర తరువాత ఆడపిల్ల పుట్టిందని కూతురిని తీవ్రంగా వేధించేవాడని, నిత్యం తాగి గొడవ పడుతుండేవాడని మృతురాలి తల్లి జరీనా చెప్పింది.
అంతేకాకుండా కుక్కర్ ప్లగ్ తీగతో గొంతుకు బిగించి హత్య చేశారని, తర్వాత రేష్మ ఎడమ చేతి మణికట్టును కత్తితో కోసి రక్తపు మరకలు కింద పడకుండా జాగ్రత్త పడినట్లు ఆరోపణలు మొదలయ్యాయి. ముసలయ్య అక్రమ సంబంధం గురించి అడిగినందుకు రేష్మను అతికిరాతకంగా హత్యచేశాడని, అడ్డువస్తుందని పసికందును కూడా గొంతుకు తీగబిగించి హత్య చేశాడని వాపోయింది.
రేష్మ గొడవ పడుతుందని ఆదివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ముసలయ్య ఫోన్ చేశాడు. సర్ది చెప్పి పెట్టేశాక.. రాత్రి 10గంటలు దాటిన తరువాత నీ కుమార్తె ఉరి వేసుకొని మరణించిందని ఫోన్ ద్వారా తెలిపాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో మధ్యాహ్నం 4 గంటల నుంచి కేకలు వినిపిస్తున్నాయని, భార్యభర్తలు గొడవ పడుతున్నారని అనుకున్నామని స్థానికులు చెబుతున్నారు.
రేష్మ హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి హుటాహుటిన యర్రగొండపాలెం చేరి సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు.