administrative capital
YCP Botsa Satyanarayana : ఏ క్షణమైనా పరిపాలన రాజధాని తరలించే అవకాశం ఉందని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు. మూడు రాజధానులు తమ విధానమని మరోసారి స్పష్టం చేశారాయన. కోర్టుకు వాస్తవాలు వివరిస్తామని, మూడు రాజధానులు తప్పకుండా ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. 2021, మార్చి 28వ తేదీ ఆదివారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన…మీడియాతో మాట్లాడారు.
మిగిలిన 32 మున్సిపాల్టీలు, మూడు కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. విలీన గ్రామాలను కలుపుకునే రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయన్నారు. రాజమహేంద్రవరాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
అమరావతిని శాసన రాజధాని, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం గెజిట్ నోట్ ఇవ్వడంతో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించి చట్టాలుగా మారినా..రాజధాని బిల్లులకు హైకోర్టు బ్రేకులు వేసింది. ప్రస్తుతం ఈ కేసులు విచారిస్తున్న చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ అయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజధాని వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది.
అయితే..మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో విచారణ ఏ పద్ధతిలో చేపట్టాలనే విషయమై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, పిటిషనర్ల తరఫు న్యాయవాదులతో చర్చించింది. ఇరు పక్షాల న్యాయవాదుల అంగీకారం మేరకు మే 3 నుంచి విచారణ జరుపుతామని తెలిపింది. తెలుగు కొత్త సంవత్సం ఉగాది నుంచి విశాఖ.. ఏపీకి పరిపాలనా రాజధానిగా ఉండనుందని, చట్ట పరంగానే ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందని గతంలో బోత్స వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read More : Bank holidays in April : ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకులు పనిచేయవు.. ఏ తేదీల్లో తెలుసా?