YCP chief Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy: ఎన్నికల సమయంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేశారు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలల తరువాత బాబు ష్యూరిటీ మోసానికి గ్యారెంటీ అని రుజువైందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా.. ముసలావిడ కూడా నొక్కుతుంది అన్నారు. సూపర్ సిక్స్ తో పాటు 143 హామీలు ఇచ్చారు. హామీలు గ్యారంటీ అని ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు.. కానీ, తొమ్మిది నెలల తరువాత బాబు ష్యూరిటీ మోసాలకు గ్యారెంటీ అని రుజువైందని జగన్ విమర్శించారు.
Also Read: ఏపీలో డ్వాక్రా సంఘాల్లా పురుషులకూ పొదుపు సంఘాలు.. మీరు చేరొచ్చా? లేదా? చేరితే ఎంత లాభం?
2017లో దావోస్ వెళ్లిన చంద్రబాబు హైస్పీడ్ రైళ్లు, హైబ్రీడ్ క్లౌడ్, సౌదీ ఆరాంకో, ఎయిర్ బస్ వంటి 150 సంస్థలు వస్తున్నాయని ప్రచారం చేశారు. 2019లో వెళ్లొచ్చి ఇంకా చాలా వస్తున్నాయని చెప్పారు. అవన్నీ వచ్చాయా అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈసారి దావోస్ కు వెళ్లి ఒక్క సంస్థను కూడా తీసుకురాలేక పోయారు. చంద్రబాబుపై నమ్మకం అనేది పూర్తిగా సన్నగిల్లిందని జగన్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తెచ్చింది ఏమీ లేదు. కేంద్ర బడ్జెట్ లో మనకు రావాల్సిన ప్రాజెక్టులు బీహార్ కు వెళ్లిపోయాయి. ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15కి తగ్గించేసి 1215 కోట్లు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. ఇదంతా జరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..
వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఒక్క పథకాన్ని ప్రజలకు అందించడం లేదు. పిల్లలకు ట్యాబులు ఇచ్చే పథకంసైతం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా వచ్చిన ఉద్యోగాలేమీ లేవు. వలంటీర్లనుసైతం మోసం చేశారు. వాళ్లకు రూ.10వేలు ఇస్తామని చేతులెత్తేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయి అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇసుక స్కాంలు జరుగుతున్నాయి.. మా హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారని జగన్ ఆరోపించారు. ఇసుక, మద్యం, ప్లే యాష్ ఇలా అన్నీ మాఫియాలే. ప్రతీ నియోజకవర్గంలో, మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్ లు నడిపిస్తున్నారు.. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే చంద్రబాబు ఆదాయం పెరుగుతోంది అంటూ జగన్ విమర్శించారు.