Perni Nani
Perni Nani Ration Rice Missing Case: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఏ1గా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, నలుగురిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా వారికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసులో పేర్ని నానికి పోలీసులు బిగ్ షాకిచ్చారు. ఈ కేసులో ఆయన పేరును ఏ6గా చేర్చారు.
రేషన్ బియ్యం కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజ, సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, రైసు మిల్లర్ ఆంజనేయులును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించిన అనంతరం సోమవారం రాత్రి సమయంలో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చగా.. 14రోజులు వారికి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. అయితే, వారిని విచారించిన సమయంలో బియ్యం మాయం కేసులో పేర్ని నాని పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలోనే పేర్ని నాని పేరును ఏ6గా ఎఫ్ఆర్ఐలో నమోదు చేశారు.
రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నాని ప్రమేయం ఉందని మొదటి నుంచి మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపిస్తున్నారు. తాజాగా పోలీసులు ఈ కేసులో నలుగురిని విచారించగా వారు పేర్ని నాని పేరును ప్రముఖంగా ప్రస్తావించినట్లు, ఈ క్రమంలోనే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసులు తొలుత విచారణకు హాజరు కావాలని పేర్నినానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత విచారణలో ఆయన చెప్పిన వివరాలను బట్టి.. మరోసారి విచారణకు రావాలని సూచిస్తారా.. విచారణ సమయంలోనే అరెస్టు చేస్తారా అనేది ఉత్కఠగా మారింది. ఇదిలాఉంటే.. ఏపీ హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.