YCP MLA Anam : కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

formation of new districts in ap : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలతో పాటు ఇతర ఆఫీసుల ఏర్పాటుకు భవనాలు గుర్తిస్తున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఉన్న ఏరియా ఆసుపత్రులను జిల్లా హాస్పిటల్స్ స్థాయికి పెంచుతున్నారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడితే వేల కోట్ల నిధులు కావాలని తెలిపారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ఆయన ప్రశ్నించారు. తమకు రోడ్లు వేయడానికే నిధులు లేవని.. రోడ్లు వేసుకునేందుకు నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. ఉగాది నుంచే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్లు, సవరణ ఉత్తర్వులపై జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి సలహాలు, సూచనలను మార్చి 3వ వరకు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 కానున్నాయి.

ఉగాది నాటికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ఎన్నికలకు ముందు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. అందుకు తగినట్లు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి

New Districts : ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..!

మార్చి 15 నుంచి 17 మధ్య తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆ తర్వాత మార్చి 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అదే రోజు నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయనున్నారు.

కొత్తగా ప్రకటించిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పేర్లపై వస్తున్న అభ్యంతరాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల్లో ఇప్పటికే కొన్ని వినతులు వచ్చాయి. వాటిని స్వీకరించి, ఆ అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ట్రెండింగ్ వార్తలు