ycp mlc janga krishna murthy respond on anil kumar yadav comments
Janga Krishna Murthy: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. గుంటూరు లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన గురించి మాట్లాడే అర్హత అనిల్ యాదవ్‌కు లేదని అన్నారు. పదవుల కోసం తాను ఆశపడలేదని, బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నదే తన తాపత్రయని చెప్పారు. తనను హేళన చేసినవారే వైసీపీలో పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదవులు ఇవ్వలేదని నేను చెప్పలేదు
”మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నా గురించి మాట్లాడారు. నాకు ఎవరో స్లిప్ ఇచ్చారని దాని ప్రకారం నేను మాట్లాడానని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం. భజన చేయడం నా పద్దతి కాదు. ఒకరిని పొగడటం, నిందించడం నేను చేయలేదు. పదవులు ఇవ్వలేదని నేను చెప్పలేదు. నా గురించి మాట్లాడే అర్హత అనిల్‌కు లేదు. ఎవరి మొప్పు కోసం రాజకీయం చేయలేదు. నన్ను ఎంపీగా పోటీ చేయమన్నారని అనిల్ అంటున్నారు. నేను పదవుల కోసం ఆశ పడలేదు. పదవులిచ్చారు గాని అధికారం ఇవ్వలేదని చెప్పాను. బీసీలకు గౌరవం ఇవ్వలేదని.. వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పాను.
వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలని పాదయాత్ర చేశాను. స్వేచ్ఛ సమానత్వంతో బీసీలు అభివృద్ధి చెందాలి. బీసీలకు రాజ్యాధికారం కావాలి. 2014లో ఓడిపోతానని తెలిసే టికెట్ ఇచ్చారనడం హాస్యాస్పదం. నేను సర్పంచ్ అయినప్పుడు అనిల్ లాగులు కట్టుకొని ఉంటాడు. వైసీపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయడంతోనే నేను ఓడిపోయాను. నన్ను హేళన చేసినవారే ఈరోజు అక్కడ పెత్తనం చేస్తున్నారు. నా ఆస్తుల మీద విచారణ చేయించండి. నిందలు మానండి.. ఎవరి మెప్పు కోసం మాట్లాడకండి” అంటూ అనిల్ యాదవ్‌కు జంగా కృష్ణమూర్తి హితవు పలికారు.
Also Read: ప్లేస్ మారింది, నేను మారలేదు.. నాలో ఫైర్ అలాగే ఉంది.. అనిల్ కుమార్ యాదవ్
కాగా, వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదని జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పదవులు ఉన్నన్ని రోజులు అంతా అనుభవించి ఇప్పుడు నెగెటివ్‌గా మాట్లాడడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ పై తాజాగా జంగా కృష్ణమూర్తి స్పందించారు.