గురజాల టికెట్ ఆశిస్తున్నా.. నేనేం చేశానో ప్రజలే చెబుతారు: జంగా కృష్ణమూర్తి

గురజాల టికెట్ ఆశిస్తున్నాను. పార్టీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.

YCP mlc janga krishna murthy respond on party change news

Janga Krishna Murthy: తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలపై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పందించారు. తాను ఇంకా వైసీపీలోనే ఉన్నానని, పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. బీసీ సంఘాల నేతలతో కలిసి గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ”గురజాల టికెట్ ఆశిస్తున్నాను. పార్టీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. ఆత్మగౌరవం మాకు ముఖ్యం. అందుకే టికెట్ కోసం పోరాటం చేస్తున్నాను. యాదవులకు అన్యాయం జరిగిందని నేను ఎప్పుడూ చెప్పలేదు. బీసీలకు, యాదవులకు నేనేం చేశానో ప్రజలే చెబుతార”ని జంగా కృష్ణమూర్తి అన్నారు.

బీసీ సంఘం నేత డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జంగా కృష్ణమూర్తికి అవమానం జరిగితే తమకు జరిగినట్లు భావిస్తామని అన్నారు. ”జంగా కృష్ణమూర్తికి అన్ని బీసీ సంఘాల నేతలు సంఘీభావం తెలియజేస్తున్నారు. యాదవులకి జంగా కృష్ణమూర్తి ఏం చేశారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మెడిసిన్ సీట్లలో బీసీలకు అన్యాయం జరుగుతోందని మొదట మాట్లాడిన వ్యక్తి జంగా. బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకు జంగా కృష్ణమూర్తి కృషి చేశారు. ఒక్కసారి పోటీ చేసి గెలిచిన వ్యక్తి గురజాలలోనే స్థిరపడిపోతానని అంటున్నారు‌. అటువంటి వారి పీఠాలు కూలిపోయేదాకా పని చేస్తాం. జంగాకు అధికార పార్టీ న్యాయం చేస్తుందని భావిస్తున్నామ”ని డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Also Read: వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాంరాం? ఏం చేస్తున్నారో తెలుసా?

ప్రసుత్తం గురజాల ఎమ్మెల్యేగా కాసు మహేశ్ రెడ్డి ఉన్నారు. ఆయనను మార్చి తనకు టికెట్ ఇవ్వాలని జంగా కృష్ణమూర్తి అడుగుతున్నారు. ఒకవేళ టికెట్ దక్కపోతే పార్టీ మారే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో చేరతానని ఇప్పటికే ప్రకటించిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని ఆయన కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే గురజాల టికెట్ పై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చే వరకు వేచిచూడాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది. మరోవైపు ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఏయే మార్పులు ఉంటాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read: ఎవరి సీట్లు ఉంటాయో, ఎవరి సీట్లు గల్లంతవుతాయో.. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో టెన్షన్‌