Weather Updates: ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

Rains

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలోనూ నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెప్పింది. ఉపరితల ఆవర్తనం గుజరాత్‌ దాని సమీప ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతుతోందని పేర్కొంది. నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

కర్ణాటకలో భారీ వర్షాలు
పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణా పరివాహక ప్రాంత నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. కర్ణాటకలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళూరు శివారు ప్రాంతాల్లో దాదాపు అన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరుతోంది. దీంతో బెళగావి గోవా ప్రధాన రహదారిని మూసేశారు. శృంగేరి, మంగళూరు మధ్య కొండచరియలు విరిగిపడడంతో ఆ మార్గాన్నీ మూసేశారు.