YS Jagan Vizag Tour : మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ హామీ.. ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షల ఆర్థిక సాయం
YS Jagan Vizag Tour : మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. బాధితులకు రూ.కోటి చొప్పున ఎక్స్రేషియా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెలలోపే ఆదుకుంటామన్నారు.
YS Jagan Vizag Tour
- మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ భారీ చేయూత..
- మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం.. రూ. 7 లక్షలు ఇస్తామన్న జగన్
- ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్
- ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెలలోపే ఆదుకుంటాం
YS Jagan Vizag Tour : మత్స్యకారుల కుటుంబాలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే, ప్రాణాలతో బయటపడిన చిన్నా కుటుంబానికీ అదే మొత్తంలో సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోయినా బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ నెల ఒకటో తేదీన ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా, 4వ తేదీన ప్రమాదం జరిగిందని జగన్ తెలిపారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు చిన్నా ఇంటికి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పాడని, అంతలోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
సమచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదు :
మత్స్యకారుల కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చినా ఫిషరీస్ అధికారులు, జిల్లా యంత్రాంగం స్పందించలేదని జగన్ విమర్శించారు. రాత్రి 10.30 గంటలకే కలెక్టర్, మెరైన్ సీఐకి సమాచారం ఇచ్చారని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒకవేళ చర్యలు తక్షణమే తీసుకుని ఉంటే కనీసం ఐదుగురు ప్రాణాలతో బయటపడేవారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పు జరిగిన కారణంగానే త్రీమెన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదికలో కూడా తప్పులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఘటన జరిగిన రోజు ఎవరూ కూడా బాధిత కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు.
అధికారులు, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, ఫిషరీస్ మంత్రి ఎవరూ కూడా వెళ్లలేదన్నారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించలేదన్నారు. రాష్ట్ర హోంమంత్రి కేవలం వీడియో కాల్కే పరిమితమయ్యారని జగన్ విమర్శించారు.
ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి :
మత్స్యకారు బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్గ్రేషియా ఏమాత్రం సరిపోదన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోయినా భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు భరోసా కల్పించామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జైళ్లలో చిక్కుకున్న మత్స్యకారులను సైతం స్వదేశానికి తీసుకొచ్చామన్నారు. అలాగే, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కూడా తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.
హార్బర్ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా తమ ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, మత్స్యకారులకు అన్ని విధాలా వైసీపీ అండగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు.
