ముగిసిన పాదయాత్ర : పైలాన్ ఆవిష్కరించిన జగన్
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజులు జగన్ పాదయాత్ర సాగింది. 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఇచ్ఛాపురం దగ్గర జగన్ పైలాన్ ఆవిష్కరించారు. 88 అడుగుల ఎత్తులో విజయస్థూపం పేరుతో పైలాన్ నిర్మించారు. మూడంతస్తులుగా స్థూపం నిర్మించారు. స్థూపంలో 13 జిల్లాలకు చెందిన 13 మెట్లు ఏర్పాటు చేశారు.
2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. 13 జిల్లాల్లో 341 రోజులు పాటూ సాగిన యాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో.. 2,516 గ్రామాల్లో.. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైతులు, మహిళలు, యువతకు భరోసా కల్పిస్తూ రూపొందించిన ఏడు పథకాల ప్రాముఖ్యతను వివరించారు. తొలిరోజు నుంచి పాదయాత్రలో ప్రతి నియోజకవర్గం, గ్రామాల్లో సమస్యలపై ఆరా తీశారు. స్థానిక ప్రజలు.. ముఖ్యంగా నిరుపేదులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలతో మమేమకమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూనే.. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అవినీతిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.