YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకేఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ జగన్ విమర్శించారు. భూముల రీసర్వే ఆలోచన నాకు నా పాదయాత్రలోనే వచ్చింది. రైతన్నలు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపేందుకు రీ సర్వే చేస్తామని హామీ ఇచ్చాం. వైసీపీ హయాంలో భూ సర్వేను యహాయజ్ఞంలా చేపట్టాం. వివాదాలులేని విధంగా పారదర్శకంగా భూములు రీ సర్వే చేశామని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
2019 మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేస్తామని పెట్టామని, చెప్పినట్లుగానే 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే మొదలు పెట్టామని జగన్ అన్నారు. మేము అధికారంలోకి రాకముందు సర్వేయర్లు లేరు, భూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా లేదు. సవాలక్ష భూ సమస్యలకు పరిష్కారం చేయడమే లక్ష్యంగా రీ సర్వే చేశామని జగన్ అన్నారు. 22ఏలో భూములు పెట్టడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు రీసర్వే చేశాం. రికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా సంస్కరించాం. భూ యాజమానులకు శాశ్వత పత్రాలు రైతులకు అందించాం. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రైతులకు పాస్‌బుక్‌లు ఇచ్చాం.. ఆ పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ కూడా పెట్టామని జగన్ పేర్కొన్నారు.
సమగ్ర సర్వే చేసిన మేం చేసిన ప్రతీది రికార్డే.. ఇది ఎవరూ తుడిచిపెట్టలేనిదని జగన్ అన్నారు. భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించింది. సర్వేకుగాను కేంద్రం మా ప్రభుత్వానికి ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చింది. కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారు. మహారాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారని, అసోం కూడా మా సహకారం కోరిందని జగన్ చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ మేం చేపట్టిన సర్వేను మెచ్చుకున్నారని, కానీ, దుష్ర్పచారంతో భూ సర్వే క్రెడిట్ ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలని చూనస్తున్నారని, నిజాలను ఎంతోకాలం దాచిపెట్టలేరని జగన్ అన్నారు
80ఏళ్లొచ్చాయి.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావ్.. ఎప్పుడైనా భూములు రీ సర్వే చేయాలన్న ఆలోచన వచ్చిందా అంటూ చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. సర్వే రాళ్లు పెట్టకుండా సర్వే ఎలా పూర్తయినట్టు?
ఏ రాయి పడితే ఆరాయి పెట్టి సర్వే రాయి అంటారా? గతంలో సర్వే టెక్నాలజీనే లేదు. మేం అమెరికా నుంచి తెప్పించాం. సర్వేయర్లను నియమించాం. సుమారు 40వేల మంది భూముల రీ సర్వే మహాయజ్ఞంలో పాల్గొన్నారని జగన్ చెప్పారు.