Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరాత్రిలోనే ఢమాల్.. ఏం జరిగిందంటే? నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక్కరాత్రిలోనే గోల్డ్, సిల్వర్ రేటు భారీగా పతనమైంది.

గడిచిన కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. దీంతో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అయితే, తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఒక్కరాత్రిలోనే గోల్డ్, సిల్వర్ రేటు భారీగా పతనమైంది.

బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయమేనని నిపుణులు పేర్కొంటున్నారు. యూరోపియన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు సుంకాల బెదిరింపులతో ధరలు నింగిని తాకాయి.. అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో పసిడి ధరలు నేల చూపులు చూశాయి.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 2,290 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 2,100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 37డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ ధర 4,797 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలసైతం భారీగా తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది. ఈ నెల ప్రారంభం నుంచి ఈ స్థాయిలో తగ్గుదల చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,41,450కు చేరుకోగా.. 24క్యారట్ల ధర రూ.1,54,310కు చేరింది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,41,600కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,54,460కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,41,600కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,54,460కు చేరింది.

ఇవాళ్టి వెండి ధర ఇలా : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,40,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,25,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,40,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
