ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు.

YS Sharmila appointed Andhra Pradesh Congress President

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.మరో కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఏపీలో పార్టీ పూర్వవైభవం తీసుకురావాలని
కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

ముందునుంచి ఊహించినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. జనవరి 4న ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు అధిష్టానం ఏ బాధ్యతలు ఇచ్చినా కట్టుబడి ఉంటానని పార్టీలో చేరినప్పుడు షర్మిల అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న తన తండ్రి వైఎస్ఆర్ ఆశయ సాధనకు పాటు పడతానని తెలిపారు.

Also Read: గెలుపు సంగతి తర్వాత, పోటీ చేయడమే ముఖ్యం.. ఏపీలో జోరుగా టికెట్ల రేస్

గిడుగు రుద్రరాజుకు సీడబ్ల్యూసీ పదవి
షర్మిల కోసం పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకున్న గిడుగు రుద్రరాజుకు మరో పదవి దక్కింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయనకు స్థానం కల్పించారు. పీసీసీ చీఫ్ గా ఆయన అందించిన సేవలను పార్టీ ప్రశంసించింది.

ఏపీలో పార్టీకి పునర్వైభవం తెస్తా: వైఎస్ షర్మిల
తన మీద ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో పార్టీని పునర్నిర్మాణం చేయడానికి.. పునర్వైభవం సాధించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. క్షేత్ర స్థాయి కార్యకర్తలతో కలిసి పార్టీ వృద్ది కోసం పని చేస్తానని చెప్పారు. గిడుగు రుద్రరాజు, కీలక నాయకుల సహకారంతో పార్టీని బలోపేతం చేసేలా పాటుపడతానన్నారు.

అధిష్టానానికి మల్లు రవి కృతజ్ఞతలు
ఏపీసీసీ అధ్యక్షులుగా నియమించినందుకు.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ నేత మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. షర్మిలను ఏపీసీసీ అధ్యక్షులుగా నియమించచడం హర్షణీయమని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా షర్మిల రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన విధంగానే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.