గెలుపు సంగతి తర్వాత, పోటీ చేయడమే ముఖ్యం.. ఏపీలో జోరుగా టికెట్ల రేస్

బలం చూపించుకొనో, బతిమాలుకొనో టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. సొంత పార్టీలో కుదరకపోతే మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు కూడా వెనకడాటం లేదు.

గెలుపు సంగతి తర్వాత, పోటీ చేయడమే ముఖ్యం.. ఏపీలో జోరుగా టికెట్ల రేస్

Ticket Race In Andhra Pradesh

Andhra Pradesh Politics : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టికెట్ రేస్ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం పోరాటం చేస్తుంటే.. అభ్యర్థులు మాత్రం పోటీ కోసం ఆరాటపడుతున్నారు. ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న పార్టీలు.. గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. ఈ క్రమంలో సిట్టింగ్‌లైనా, కీలక నేతలైనా నిర్మొహమాటంగా టికెట్ నిరాకరిస్తున్నాయి. కానీ.. ఎలాగైనా పోటీ చేయాలన్న లక్ష్యంతో ఉన్న పలువురు నేతలు మాత్రం.. అవసరమైతే పక్క పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

గెలిచే సత్తా ఉంటేనే టికెట్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గెలుపు గుర్రాలనే బరిలో దింపుతామని.. విజయం మాత్రమే కొలమానమని చెబుతున్నాయి పార్టీల అధిష్టానాలు. సీనియారిటీని సైతం పక్కన పెట్టి గెలుపు అవకాశాలను మాత్రమే చూస్తున్నాయి అన్ని పార్టీలు. అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టీడీపీ వరకు పార్టీ ఏదైనా సరే.. గెలిచే సత్తా లేకుంటే టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే వారి లక్ష్యం. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ.

Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..! సంక్రాంతి తర్వాత విడుదల..!

టికెట్ కోసం జంప్ అయ్యేందుకు కూడా రెడీ..
మరోవైపు పలువురు నేతలు మాత్రం.. తాము ఎలాగైనా బరిలో ఉండాలని చూస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం సంగతి అటుంచితే.. ముందు టికెట్ దక్కించుకొని పోటీలో దిగాలన్నదే వారి ఆలోచన. బలం చూపించుకొనో, బతిమాలుకొనో టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. సొంత పార్టీలో కుదరకపోతే మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు కూడా వెనకడాటం లేదు. నిన్నమొన్నటి వరకు తమ అధినేతల పట్ల విధేయత, విశ్వాసం చూపించిన నేతలంతా.. ఇప్పుడు టికెట్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. టికెట్ ఇవ్వని పార్టీ తమకెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తూ… వేరే పార్టీల్లో జాయిన్‌ అయిపోతున్నారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి.. వైసీపీ నుంచి టీడీపీలోకి..
ఇటీవలి కాలంలో ఏపీలోని ప్రధాన పార్టీల్లో పలువురు అభ్యర్థులు ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు మారిపోవడం సాధారణమైపోయింది. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ రాదన్న సంకేతం రావడంతో.. ఆయన వైసీపీలో చేరిపోయారు. అంతేకాదు.. అక్కడ సిట్టింగ్ స్థానం నుంచే అధికార పార్టీలో టికెట్ కన్ఫామ్ చేసుకున్నారు. ఇక వైసీపీలో టికెట్ దక్కని కొలుసు పార్థసారథి.. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ సైతం.. టికెట్‌ రాకపోవడంతో వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు.

Also Read : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు

పార్టీ మారే యోచనలో వైసీపీ కీలక నేత?
అధికార వైసీపీలో జరిగిన మార్పుల్లో భాగంగా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలకు టికెట్లు దక్కలేదు. కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ టికెట్ రాకపోవడంతో వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో ట్రయల్స్ వేస్తున్నారు. మరో ఎంపీ బాలశౌరి సైతం జనసేనలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాపు రామచంద్రారెడ్డి, ఎలిజా వంటి నేతలు కూడా ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తను అనుకున్న వారికి సీట్లు దక్కకపోతే… బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా ఎన్నికల్లో గెలవడం, కోసం ప్రజల్ని ప్రసన్నం చేసుకునేందుకు నాయకులంతా ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. ముందు టికెట్ దక్కించుకోవడం కోసమే పడిగాపులు పడుతున్నారు. అంతేకాదు.. పార్టీ ఏదైనా సరే.. పోటీ మాత్రం తప్పని సరి అని తేల్చిచెబుతున్నారు కొందరు నేతలు.