MP Avinash Reddy .. Ys Viveka Case
YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయటం, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించటం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై టీఎస్ హైకోర్టు విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అవినాశ్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. తన అనుచరవర్గంతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే అవినాశ్ రెడ్డి పులివెందులలోని తన ఇంటిలో భవిష్యత్ కార్యచరణ కోసం యోచిస్తుంటే మరోవైపు సీబీఐ అధికారులు పులివెందుల సివారులో కాపు కాశారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయటానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో అవినాశ్ ను హైదరాబాద్ సీబీఐ అరెస్ట్ చేయకుండా పులివెందులకు ఎందుకు వెళ్లారు?మరోసారి విచారణ చేయటానికా? లేదా అవినాశ్ సమావేశం పూర్తి అయ్యాక అరెస్ట్ చేయటానికా? అనే విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది.
కాగా..సోమవారం (ఏప్రిల్ 24,2023) సుప్రీంకోర్టులో అవినాశ్ బెయిల్ విచారణ జరిగిన తరువాత ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాదులు టీఎస్ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అవినాశ్ ను సీబీఐ అరెస్టు చేస్తే ఇక పిటిషన్‌పై విచారణ జరిపినా ఎటువంటి ప్రయోజనం ఉండదని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందలేదని న్యాయమూర్తికి తెలిపారు.
YS Sunitha Reddy : వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ అంటూ పోస్టర్లు .. ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్
దీనిపై హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి లేకుండా విచారణ ఎలా కొనసాగిస్తాం?సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం మేరకే తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో అవినాశ్ న్యాయవాది సుప్రీంకోర్టును ఆ ప్రతి కోసం కోరతామని.. మధ్యాహ్నానికి సుప్రీం ఉత్తర్వుల ప్రతిని సమర్పిస్తామని చెప్పారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు దీనిపై విచారణ జరిపే అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. అన్నట్లుగానే మ. 2.30 గంటల తర్వాత ఈ అంశంపై అవినాష్ న్యాయవాదులు మరోసారి ధర్మాసనం వద్ద ప్రస్తావించకపోవడంతో న్యాయస్థానం.. విచారణ రేపటికి వాయిదా వేసింది. బహుశా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన పత్రాలు అంది ఉండకపోవచ్చని తెలుస్తోంది.అందుకే మధ్యాహ్నాం అవినాశ్ న్యాయవాదులు ధర్మాసనం ముందుకు ఈ విషయాన్ని తీసుకురానట్లుగా తెలుస్తోంది.
కాగా..వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అన్ని కోణాల్లోని ఇరుక్కుపోయినట్లుగా ఉంది. ఓ పక్క పట్టువదలని విక్రమార్కురాలిలా వైఎస్ సునీత అవినాశ్ ను దిగ్భంధనం చేస్తోంది.బెయిల్ రాకుండా చేసి సుప్రీంకోర్టుతో మరోసారి షాకిచ్చింది దాయాదికి. తన తండ్రి హత్య నిందుతులు ఎవరో తేలేదాకా వదిలేది లేదంటోంది సునీతమ్మ. దీంతో అటు బెయిల్ దొరక్క..ఇటు రాజకీయ భవిష్యత్తే కాదు సాధారణ భవిత ఏంటో కూడా అంతుపట్టక ఓపక్క అరెస్ట్ భయం మరోపక్క దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకున్నారు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అవినాశ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా హైదరాబాద్ లో అరెస్ట్ చేయకుండా అతను పులివెందులకు వెళ్లకముందే సీబీఐ అధికారులు పులివెందులకు ఎందుకు వెళ్లినట్లు? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.