Nallapareddy Prasanna Kumar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి హైకోర్టులో చుక్కెదురు.. అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులకు కీలక ఆదేశాలు

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీరును జగన్ తప్ప ఎవరూ సమర్థించరని.. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని..

Nallapareddy Prasanna Kumar Reddy: కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించాలని చెప్పింది. BNS 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీరును జగన్ తప్ప ఎవరూ సమర్థించరని.. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు.

కాగా, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రసన్నకుమార్‌ రెడ్డి వ్యాఖ్యలను కోర్టు తప్పు పట్టింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి? అని మండిపడింది. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీసింది. అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించలేము అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డిని ఏపీ హైకోర్టు మందలించింది. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని ఆదేశించింది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మీ వ్యాఖ్యలతో న్యూసెన్స్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Also Read: చంద్రబాబు ప్రభుత్వం పోతుందని ప్రజలకి తెలిసిపోయింది: వైఎస్ జగన్

అసలు ఇద్దరి మధ్య వివాదం ఏంటి?
ఇటీవల కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాత ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లోని ఫర్నీచర్, వస్తువులు, కారుని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ప్రసన్నకుమార్ రెడ్డి అసలు ఏమన్నారంటే..
ప్రశాంతి వల్ల ఆమె భర్త ప్రభాకర్‌కు ప్రాణహాని ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. అంతేకాదు ”ఆమెకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో తెలియదు. అవినీతిలో నేను పీహెచ్‌డీ చేశానని అంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతమ్మ బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు. జాగ్రత్తగా ఉండు ప్రభాకరన్నా” అన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.

జూలై 7న వైసీపీ కోవూరు నియోజక వర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు. ఆమెను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనుచితమైన మాటలు మాట్లాడారు. అదే రోజు రాత్రి ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఒక మహిళ గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ టీడీపీ నేతలు ప్రసన్న కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులకు మహిళలంటే గౌరవం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం అని మండిపడ్డారు.