YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం పోతుందని ప్రజలకి తెలిసిపోయింది: వైఎస్ జగన్
ఏపీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ అని వైఎస్ జగన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
“మరో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని ప్రజలకి తెలిసిపోయింది. తమ సమస్యలు చంద్రబాబు పరిష్కరించరని ప్రజలకు అర్థం అయ్యింది. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అనే భావనకు ప్రజలు వచ్చేశారు. తమకున్న ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజలు వైసీపీ తలుపు తడుతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూల్ చేసి చినబాబుకి సగం, ఎమ్మెల్యేలకు సగం ఇస్తున్నారు. ఇవన్నీ భరించలేక సిద్దార్థ్ కౌశిల్ లాంటి యంగ్ అధికారులు వీఆర్‌ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారు” అని జగన్ అన్నారు.
ఏపీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ అని వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పోరాడే పార్టీ వైఎస్సార్సీపీ అని చెప్పారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని తెలిపారు.
రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రజల తరఫున పోరాడడం తమ ధర్మమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని ఏడాది పాలనలో చంద్రబాబు నెరవేర్చలేదని తెలిపారు. కరెంట్ చార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల భారాన్ని మోపారని చెప్పారు.
ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా వైసీపీ తోడుగా నిలబడిందని జగన్ చెప్పారు. ఈ ఏడాది పాలనలో ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా, అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. రైతులు, విద్యార్థల సమస్యలు, విద్యాదీవన, వసతి దీవెనలు, నిరుద్యోగ భృతి, కరెంట్ చార్జీల వంటి వాటిపై పోరాడామని అన్నారు.
గత ఏడాది డిసెంబర్ 13న రైతుల హక్కుల కోసం, డిసెంబర్ 24న కరెంట్ చార్జీలపై, ఈ ఏడాది మార్చి 12న యువత సమస్యలపై గళం విప్పామని తెలిపారు. జూన్ 4న చంద్రబాబు పాలనపై విన్నపాలు, నిరసనలు చేయడం ద్వారా తాము ప్రజల సమస్యలను లేవనెత్తామని అన్నారు.