Rachamallu Siva Prasad Reddy (Photo : Google)
Rachamallu Siva Prasad Reddy – Daughter Marriage : పరువు కోసం ప్రతిష్ట కోసం కులం, మతం పిచ్చితో కడుపున పుట్టిన పిల్లలను చంపుకుంటున్న కసాయి మనుషులున్న రోజులు ఇవి. కూతురు ప్రేమించిందని కన్నతల్లిదండ్రులే కడతేరుస్తున్నారు. కన్నబిడ్డ అనే కనికరం కూడా చూపడం లేదు. కొంతమంది సుపారీ ఇచ్చి మరీ కిరాయి హంతకులతో తమ పిల్లలను హత్య చేయిస్తున్నారు. తమ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తమ కులంలో పరువు పోయిందని, అవమానం జరిగిందని రగిలిపోతూ మర్డర్ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. చాలా సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారితీస్తున్నాయి. కన్నతల్లిదండ్రులే తమ పిల్లలను చంపుతున్నారు. కడుపున పుట్టిన పిల్లలకన్నా.. డబ్బు, హోదా, కులం, మతానికే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు కొందరు పేరెంట్స్.
అయితే, అందుకు భిన్నంగా ఓ ఘటన జరిగింది. అందరు తల్లిదండ్రులు అలానే ఉంటారని అనుకోవడం కరెక్ట్ కాదని కొందరు నిరూపిస్తున్నారు. తాజాగా ఏపీలో అధికార పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే దగ్గరుండి మరీ కూతురి కులాంతర ప్రేమ వివాహం జరిపించారు.
వైఎస్‌ఆర్ జిల్లా (కడప) ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆదర్శవంతమైన పని చేశారు. తన కూతురు పల్లవికి ప్రేమ వివాహం జరిపించారాయన. ఆయనే స్వయంగా దగ్గరుండి మరీ ఈ కులాంతర పెళ్లి చేశారు. ఎమ్మెల్యే కూతురు పవన్ అనే యువకుడిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకు ఎమ్మెల్యే రాచమల్లు అంగీకారం తెలిపారు. దీంతో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కూతురి వివాహం చేశారు. అనంతరం ప్రొద్దుటూరులోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు.
Also Read: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!
”నా కూతురు ఇష్ట ప్రకారం దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించాను. కులాంతర వివాహానికి ఒప్పుకుని వారిని ఆశీర్వదించాను. కలిసి చదువుకున్న రోజుల్లో ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. దాంతో పేదవాడైన పవన్‌తో నా కూతురి పెళ్లి చేశా. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వలేదు. వారి ఇష్టప్రకారమే అంగీకారం తెలిపి పెళ్లి చేశాను” అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
Also Read: నన్ను అరెస్టు చేస్తారేమో.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కడుపున పుట్టిన పిల్లల కన్నా.. డబ్బు, హోదా, పరపతి, కులం, మతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో.. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా కూతురు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన ఎమ్మెల్యే రాచమల్లును అంతా ప్రశంసిస్తున్నారు. ఆయన గొప్ప మనసును అంతా మెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా చేయడం అందరికీ ఆదర్శప్రాయం అవుతుందని అంటున్నారు.