Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!

ఒకప్పటి కంచుకోటైన గుడివాడలో తిరిగి ఆ వైభవం సాధించాలన్నా.. టీడీపీకి కంట్లో నలుసులా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిని ఓడించాలన్నా సరైనోడు ఉండాల్సిందే అన్నది క్యాడర్ అభిప్రాయం.

Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!

who will getting gudivada TDP ticket

Gudivada TDP:తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన గుడివాడ అసెంబ్లీ సీటుపై (Gudivada Assembly Seat) పీఠముడి వీడటం లేదు. ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ (NTR) ప్రాతినిధ్యం వహించిన గుడివాడ.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అడ్డాగా మారిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న కొడాలిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది టీడీపీ.. ఐతే నానికి దీటైన నాయకుడిని ఎంచుకోలేక.. ఇన్‌చార్జి నియామకాన్ని వాయిదాపై వాయిదా వేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నా.. ఇన్‌చార్జి ఎవరో తేల్చకుండా నాన్చుతుండటం అంతిమంగా పార్టీకి నష్టమేనంటున్నారు కార్యకర్తలు.. ఇంతకీ గుడివాడపై టీడీపీలో స్పష్టత లేకపోవడానికి కారణమేంటి?

గుడివాడలో విజయం టీడీపీకి ఎంతో అవసరం.. పార్టీ అధినేత చంద్రబాబుకు మరెంతో ప్రతిష్టాత్మకం.. ఒకప్పటి కంచుకోటైన గుడివాడలో తిరిగి ఆ వైభవం సాధించాలన్నా.. టీడీపీకి కంట్లో నలుసులా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిని ఓడించాలన్నా సరైనోడు ఉండాల్సిందే అన్నది క్యాడర్ అభిప్రాయం. గత ఎన్నికల్లో దేవినేని అవినాశ్‌ను (Devineni Avinash) ఇక్కడి నుంచి పోటీ చేయించిన టీడీపీ.. ఎన్నికల తర్వాత అతడు వైసీపీకి వెళ్లిపోవడంతో తిరిగి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకే (Ravi Venkateswara Rao) పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఐతే ఆయన వయసు రీత్యా నానిపై దూకుడు చూపలేకపోతున్నారని భావిస్తున్న అధిష్టానం.. ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాముకు (Venigandla Ramu) గుడివాడ బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకత్వం అందించిన రావి వెంకటేశ్వరరావును ఒప్పించలేక.. రామును ఇన్‌చార్జిగా ప్రకటించలేక వెనక్కి తగ్గుతోంది టీడీపీ. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ఈ సారి చాన్స్ ఇచ్చి చూడండి.. నెగ్గుకు వస్తానంటూ అధిష్టానాన్ని ఇరకాటంలో పెడుతున్నారు మాజీ ఎమ్మెల్యే రావి.. సిట్టింగ్ ఎమ్మెల్యే నానిని ఢీకొట్టాలంటే.. అంగ, అర్థ బలాల్లో దీటైన నాయకుడే ఉండాలని భావిస్తున్న టీడీపీ.. వెనిగండ్ల రాముపై వంద శాతం ఆసక్తి కనబరుస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే రావిని ఒప్పించలేక తర్జనభర్జన పడుతోంది. వచ్చేఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైనా.. చివర్లో ఏమైనా జరగొచ్చనే సంశయంతో ముందడుగు వేయలేకపోతున్నారు వెనిగండ్ల రాము. రావికి ఎమ్మెల్సీ ఇస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, సత్యనారాయణరాజుతో అధిష్టానం కబురు పంపినా.. ఆయన మాత్రం ఆఖరి ప్రయత్నం.. ఒకే ఒక్క చాన్స్ అంటూ పట్టుబడటంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది టీడీపీ.

Also Read: తొందరలోనే చంద్రబాబు, లోకేశ్ జైలుకెళ్తారు.. పురంధేశ్వరి ఎందుకు మాట్లాడరు?

అటో.. ఇటో తేల్చాల్సిన సమయంలో టీడీపీ అధిష్టానం నాన్చుతుండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు తెలుగు తమ్ముళ్లు. కాలం కరిగిపోతుంటే.. తీరిగ్గా ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి ఎలాంటి మేలు జరగదని హెచ్చరిస్తున్నారు గుడివాడ నాయకులు. మాజీ ఎమ్మెల్యే రావి.. ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఇన్‌చార్జిగా నియమించి క్షేత్రస్థాయి ప్రచారానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రావి ఏమనుకుంటారోనని రాముకు.. రాము నొచ్చుకుంటారని రావిని బుజ్జగించడం వల్ల ప్రయోజనం లేదని.. ఏదైనా సరే క్లియర్‌కట్‌గా తేల్చేయాలని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.. పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నా.. నాన్చుడు వైఖరి మారకపోతే మరోసారి దెబ్బతినడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Also Read: నన్ను అరెస్టు చేస్తారేమో.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రాముకి హామీ ఇచ్చానని చెబుతున్న చంద్రబాబు.. బహిరంగంగా ఒక్క ప్రకటన చేస్తే అంతా సర్దుకుంటుందని.. కానీ ఏదీ తేల్చకుండా పెండింగ్‌లో పెట్టడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కీలకమైన గుడివాడ పంచాయితీని ఎంత త్వరగా తేల్చితే అంత మేలు జరుగుతుందని క్యాడర్ చెబుతున్నా.. నాన్చుడు ఎందుకో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కార్యకర్తలు.