Dharmavaram : ధర్మవరంలో ఉద్రిక్తత-బీజేపీ నాయకులపై వైసీపీ కార్యకర్తల దాడి

సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్ లో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Dharmavaram :  సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్ లో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులపై   వైస్సార్ కాంగ్రెస్ పార్టీ   కార్యకర్తలు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గాయపడిన వారిని పోలీసులు   మొదట ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి   తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం తీసుకువెళ్లారు.  నిన్న నియోజక వర్గంలో  జరిగిన వైసీపీ  ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి  వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దర్మవరంలో బీజేపీ నాయకులపై దాడి ఘటన తెలుసుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వరదాపురం సూరితో ఫోన్ లో మాట్లాడారు. ఈ వ్యవహారం మొత్తానికి ఎమ్మెల్యేనే కారణం అని సోము వీర్రాజు ఆరోపించారు.  ఈవిషయమై రాష్ట్ర డీఐజీ, ఎస్పీలతో ఆయన మట్లాడారు. దాడి చేస్తానని   ముందుగానే ఎమ్మెల్యే ప్రకటించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు అంశంగా తీసుకోవాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి ఈవిషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సోము డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటనలు ప్రభుత్వం నిలువరించకపోతే బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని   వీర్రాజు హెచ్చరించారు.  వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆస్పత్రిలో పరామర్శించారు.

Also Read : YCP Politics : ‘సొంత పార్టీవారే కుట్రలు చేస్తున్నారు..’వైసీపీ నేతలు బాలినేని..కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మరోవైపు ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్ లో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యంలో పట్టపగలు దాడులు చేయిస్తున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయులే బిజెపి నేతలపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే కేతిరెడ్డిని అరెస్టు చేయాలని సూర్యానారాయణ డిమాండ్ చేశారు.

పోలీసుల కేతిరెడ్డి అరెస్టు చేయకపోతే హైకోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన కేతిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నీ భూకబ్జాలు, అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తావా…గుడ్ మార్నింగ్ పేరు చెప్పి నువ్వు చేస్తున్న అవినీతి అంతా ప్రజలకు తెలుసు…నీ చంపుడు రాజకీయాలు తిమ్మపల్లిలో చూసుకో. ధర్మవరం లో దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోం.

నిన్ను మళ్లీ   తిమ్మంపల్లి పంపించాల్సిందే. కేతిరెడ్డి సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలను చంపాలని చూశారు. డి.ఎస్.పి, సీఐ ఎమ్మెల్యే కేతిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని సూర్యనారాయణ అన్నారు. నాలుగు జతల బట్టలు పెట్టుకొని వచ్చిన నీకు వెయ్యి కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది. అదంతా ధర్మవరం నియోజకవర్గ ప్రజల సొమ్ము కాదా. దౌర్జన్యం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్ట ప్రసక్తే లేదు.అన్ని ఆధారాలతో బయటపెడతాం శిక్షపడేలా చేస్తామని సూర్యనారాయణ హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు