ఆ చిన్నారి ప్రసంగానికి అమెరికా ఫిదా

వివేకానందుని చికాగో ప్రసంగాన్ని అనర్గళంగా చెప్పిన ఆ చిన్నారికి అమెరికా బ్రహ్మరథం పడుతోంది. అమెరికాలోని తానాను సిక్కోలు విద్యార్థిని ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది. ఆమె ప్రసంగాన్ని విన్నవారంతా మంత్రముగ్ధులైపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బాలిక ప్రసంగాన్ని విన్నవారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏడాదిగా ఈ చిన్నారి వీడియో ట్రెండ్ అవుతోంది.
అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలస గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ బాలిక వివేకనందుడి చికాగో ప్రసంగాన్ని ఇచ్చింది. విద్యార్థిని గురుగుబిల్లి ఢిల్లీశ్వరి వివేకానందుని షికాగో ప్రసంగాన్ని అనర్గళంగా చదివి వినిపించింది. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థిని ప్రసంగానికి ఫిదా అయిన తానా అధ్యక్షులు స్వయంగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు.. బాలిక ఢిల్లీశ్వరీ చదువు బాధ్యతను తీసుకుంటున్నట్టు తానా ప్రకటించింది. ఆ పాఠశాలలో చదివే మిగిలిన పేద విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం చేస్తామని హామీ చేశారు.
జనవరి 9, 2019న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడివలస స్కూళ్లో ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఇందులో వేకానందుని స్ఫూర్తి ప్రసంగాలపై ఉపాధ్యాయులు పోటీలు నిర్వహించారు. విద్యార్ధుల ప్రసంగాల్లో విద్యార్థిని ఢిల్లీశ్వరి అద్భుత ప్రసంగంతో అందరిని ఆకట్టుకుంది. ఢిల్లీశ్వరి ప్రసంగాన్ని పాఠశాల ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అప్పటినుంచి ఆ వీడియోకు లైక్‌లు వేలల్లో షేరింగ్‌లు కామెంట్స్ వచ్చాయి. చివరికి ఈ వీడియో తానా దృష్టికి వెళ్లింది. తానా ప్రతినిధులు ఢిల్లీశ్వరీ కుటుంబ విషయాల గురించి తాడివలస పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బాలిక భవిష్యత్తుకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఉన్నత చదువులు చదువుకునేందుకు నగదు పురస్కారాన్ని అందిస్తామన్నారు.
డిసెంబర్ 31న ఆమెకు లక్షా ముప్ఫైవేల నగదు, ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్, సైకిల్ ఇవ్వనున్నారు. పాఠశాలలో తల్లితండ్రుల్లో్ ఒక్కరి సంరక్షణలో మాత్రమే ఉన్న 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారందరికీ సైకిళ్లను అందజేయనున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్ధుల్లో మరో 30 మందికి కూడా సైకిళ్లు ఇచ్చేందుకు తానా ప్రతినిధులు హామీ ఇచ్చారు.
శ్రీకాకుళంలో నిర్వహించనున్న బాలరంజని కార్యక్రమంలో గన్నవరంకు చెందిన చలసాని దత్తు రూ. 9,999 ఢిల్లీశ్వరికి అందించనున్నారు. గురుగుబెల్లి ఢిల్లీశ్వరి తండ్రి వెంకటరమణ సెప్టెంబర్ 9, 2020న మృతి చెందాడు. ఢిల్లీశ్వరి తల్లి మీద కుటుంబ పోషణ భారం పడింది. తానా అందించనున్న సాయంతో విద్యార్థినికి, కుటుంబానికి అండ దొరికినట్టయింది.