సుబ్రహ్మణ్యస్వామి నిజంగా సర్ప స్వరూపుడా?
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..
Lord Subrahmanya
చాలామందిలో సుబ్రహ్మణ్యస్వామి సర్వస్వరూపుడా? కాదా? అని సందేహాలు వ్యక్తమవుతుంటాయి. సాధారణంగా నాగదోషాలకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తుంటారు. ఈ స్వామిని నాగదేవతగా, సుబ్రహ్మణ్యునిగా ఆరాధిస్తుంటారు. ఈశ్వరపుత్రుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకానొక సమయంలో లోక కల్యాణార్థమై సర్పరూపము ధరించాడని కొన్ని పురాణ గాథలు ద్వారా తెలుస్తుంది.
సర్పరూపము ధరించిన మాత్రమున నాగదేవతగా భావించరాదు. ఇలాగే, శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా నడుముకు నాగాభరణం ఉంటుంది. అలాగని ఆయనను నాగదేవతగా భావిస్తున్నారా? భావించట్లేదు కదా! అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసే పూజను ఆయనకే చేయాలి. నాగదేవతకు చేసే పూజను నాగదేవతకే చేయాలి. మనము ఈ కింది శ్లోకములను గమనిద్దాం.
శ్లో॥ గాంగేయం వహ్ని గర్భం శరవణ జనిత జ్ఞాన శక్తిం కుమారంగా బ్రహ్మణ్యం స్కంద దేవం గుహ మమలమిదం రుద్ర తేజ స్వరూపమ్ | సేనాన్యం తారకఘ్నం గురుమచలమిదం కార్తికేయం వడాస్వం। సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి||
శ్లో॥ షడ్వక్త్రం శిఖి వాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం! శక్తిం వజ్ర మసిం త్రిశూల మభయం ఖేటం ధను శ్చక్రకమ్ । పాశం కుక్కుట మంకుశం చవరదం దోర్భిర్దధానం సదా! ద్యాయే దీప్పిత సిద్ధిదం శివ సుతం వందే సురా రాధితమ్|| (కుమారతంత్రము)
పై శ్లోకములు పరిశీలిస్తే సుబ్రహ్మణ్యస్వామిని కొలిచినా, నాగదేవతను కొలచినా సమానమైన ఫలితం వస్తుందని చెప్పలేదు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఉపాసన చేయడం, ఆరాధించటం వల్ల నాగదోషములు సమస్తపాపములు పరిహారములు అవుతాయి. నాగదోషములను, పాపాలను హరించగల మహిమ స్వామి ఉపాసనలో ఉందని తెలుస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నాగదేవత అని గానీ, నాగదేవతే సుబ్రహ్మణ్యస్వామి అని గానీ తెలియజేయలేదు.
శ్లో॥ సర్వాభీష్ట ప్రదం తస్యాన్మహాపాతక నాశనం సుబ్రహ్మణ్య ప్రసాదేన అప మృత్యు వినాశనమ్ ఆయురారోగ్య మైశ్వర్యం పుత్రపౌత్ర ప్రవర్ధనమ్ నాగదోషహరం చైవ సర్వం సంపత్సు భావహమ్ ||
పై శ్లోకముల వలన నాగదోష నివారణాశక్తి సుబ్రహ్మణ్యస్వామికి ఉన్నప్పటికీ సర్ప ప్రీతికరమైన శాంతివిధానములను నాగదేవతలకే చేయాలిగాని సుబ్రహ్మణ్యస్వామి కాదని తెలుస్తోంది.

Brahma SRI DR Nayakanti Mallikarjuna Sharma
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956
