Amavasya 2025: డిసెంబర్ 19.. అమావాస్య.. శుక్రవారంతో కలిసి వచ్చింది. కాబట్టి దీన్ని శుక్ర అమావాస్య అంటారు. శుక్ర అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన అమావాస్య. కాబట్టి అందరూ ప్రత్యేకమైన లక్ష్మి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శుక్ర అమావాస్య లక్ష్మి పూజ ఎలా చేయాలి..
పూజ గదిలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మి దేవి ఫోటో కానీ, లేదా అష్ట లక్ష్ములున్న అష్టలక్ష్మి ఫోటో కానీ, కుడి చేత్తో బంగారు నాణెలు వర్షిస్తున్న ధనలక్ష్మి దేవి ఫోటో కానీ.. ఈ మూడింటిలో ఏదో ఒక ఫోటో పూజ గదిలో పెట్టాలి. ఆ ఫోటోకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి జిల్లేడు ఒత్తులు లేదా తామర ఒత్తులతో దీపారాధన చేయాలి.
ఈ రెండూ దగ్గర లేకపోతే పత్తితో చేసిన ఒత్తులైనా వేసి దీపం వెలిగించుకోండి. 6 వత్తులు లేదా 12 వత్తులు వేస్తే మంచిది. బహుళ అమావాస్య రోజున 6 ఒత్తుల దీపాన్ని లేదా 12 ఒత్తుల దీపాన్ని పూజ గదిలో వెలిగించుకోవాలి. ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలపండి. శుక్ర అమావాస్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే.. శుక్ర అమావాస్య రోజున దీపారాధన చేశాక ఆ దీపారాధన కుందిలో ఉన్న నూనెలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుతారో వారికి లక్ష్మీ కటాక్షం తొందరగా దొరుకుతుంది.
అలాగే కుంకుమ పువ్వు పొడిలో కొద్దిగా పన్నీరు ఉంటుంది. ఆ పన్నీరు కలిపి కుంకుమ పువ్వు పొడిని లక్ష్మీదేవి ఫోటోకు బొట్టులా పెట్టొచ్చు. దాని వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలుగుతుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేస్తూ పుష్పాలతో కానీ గంధం రాసిన మారేడు దళాలతో కానీ పూజ చేస్తూ ఒక శక్తిమంతమైన మంత్రం చదువుకోవాలి. మామూలుగా అమావాస్య రోజు ఒక మంత్రం చదివితే లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. అందులోనూ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చినప్పుడు ఆ మంత్రం చదివితే లక్ష్మీ కటాక్షానికి తిరుగుండదు. అద్భుతంగా అష్టఐశ్వర్యాలు కలగజేస్తుంది. ఆ మంత్రం.. ”ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీయై నమ:”. ఈ మంత్రాన్ని బహుళ అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తూ వీలైనన్ని సార్లు చదువుకోవాలి. 108 లేదా 54 లేదా 21 సార్లు వీలునుబట్టి చదువుకోవాలి. ఈ మంత్రం చదువుతూ లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది అని ధర్మ శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. పూజ తర్వాత పాలతో చేసిన పాయసం నైవేద్యాన్ని సమర్పించొచ్చు. లేదా తీపి పదార్ధం నైవేద్యం సమర్పించవచ్చు.