బోయింగ్ 737 మ్యాక్స్‌లను నిలిపివేయాలని డీజీసీఏ హుకుం జారీ చేసింది. మార్చి 13వ తేదీ బుధవారం సాయంత్రం 4గంటలకల్లా విమానాలన్నింటినీ నిలిపి వేయాలని ఆయా విమాన కంపెనీలను ఆదేశించింది. దీంతో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. ప్రయాణీకులను ఇతర విమానాల ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also : హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి ఆర్గానిక్ మిల్లెట్ ఎక్స్‌పో
ఇటీవలే ఇథియోపియన్‌లో జరిగిన ఘోర ప్రమాదంతో పలు దేశాలు అలర్ట్ అయ్యాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కూలి 157 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 6 నెలల కాలంలో రెండు సార్లు బోయింగ్ 737 మ్యాక్స్ రకానికి చెందిన ఈ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. వీటి భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన ప్రయాణాలను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, విమానయాన సంస్థలు నిలిపివేస్తున్నాయి.
డీజీసీఏ నిర్ణయంతో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన 2 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను రద్దు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని డీజీసీఏ స్పష్టం చేసింది.