Gold : భవిష్యత్ అంతా బంగారందేనా.. గోల్డ్ నిల్వల్లో ప్రపంచంలో రిచ్చెస్ట్ కంట్రీ ఏదో తెలుసా..?
అలంకరణకైనా.. భవిష్యత్ భరోసాకైనా. అందరికీ గుర్తొచ్చేది బంగారం. పేద, మధ్యతరగతి వారికి బంగారం ఒక ప్రైడ్. ధరించుకోవడం కోసమే కాదు.. ఆపద వచ్చినప్పుడు

Gold
Gold : అలంకరణకైనా.. భవిష్యత్ భరోసాకైనా. అందరికీ గుర్తొచ్చేది బంగారం. పేద, మధ్యతరగతి వారికి బంగారం ఒక ప్రైడ్. ధరించుకోవడం కోసమే కాదు.. ఆపద వచ్చినప్పుడు ఆదుకునే కరగని గని బంగారం. పెండ్లి అయినా..చిన్న కార్యమైనా ఉన్నంతలో బంగారం కొంటారు పబ్లిక్. ఏ శుభకార్యం అయినా ఆడ, మగ అందరూ పసడితో మెరిసిపోవాలనుకుంటారు. గోల్డ్‌కు అంత ప్రయారిటీ ఇస్తారు ఇండియన్స్. అంతేకాదు వెండిని కూడా కొనేందుకు ఇష్టపడుతున్నారు. బంగారంతో పోలిస్తే తక్కువ రేటు ఉండటం.. ఐదు పదివేలల్లో కూడా పెద్ద మొత్తంలో వస్తుండటంతో సిల్వర్‌ను కూడా కొని పెట్టుకుంటున్నారు. వెండి రేటు కూడా బంగారంతో పోలిస్తే కాస్త అటుఇటుగా పెరుగుతూనే ఉంది.
భవిష్యత్తుకు భరోసా ..
ఆడవాళ్లకు ఆభరణాలే అందం. తరాలు మారుతున్నా కట్టుకునే దుస్తులు, వేసుకునే ఆభరణాలపై ఏ మాత్రం ఆసక్తి తగ్గదు. బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు.. తమ హోదాను తెలియజేసేందుకు సైతం ధరిస్తుంటారు. అంతేకాదు గోల్డ్‌ను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తుంటారు. అందుకే ఏ మాత్రం డబ్బులు ఉన్నా ఇప్పుడు చాలామంది బంగారం కొని పెట్టుకుంటున్నారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గరున్న బంగారమే ఆస్తి అవుతుందన్న నమ్మకం ఉండటంతో.. గోల్డ్‌ను కొంటుంటారు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే అందరి దగ్గర లక్షల రూపాయలు ఉండకపోచ్చు. గోల్డ్ కొనాలంటే గ్రాము కూడా కొనొచ్చు. మూడు నాలుగు వేల రూపాయలతో గోల్డ్ కొని పెట్టుకోవచ్చు. అయితే చాలామంది గోల్డ్ కొని పెట్టుకోవడం వరకే ఆలోచిస్తారు. అది ఫ్యూచర్‌లో ఎలా ఉపయోగపడుతుందని కూడా ఆలోచించరు. ఆపద వచ్చినప్పుడు మాత్రం జనాలకు టక్కున గుర్తొచ్చేది బంగారమే. అందుకే చాలామంది పసిడి కోసం పరుగులు తీస్తున్నారు. ఒకటి రెండు వేలు రేటు తగ్గినా వెంటనే ఉన్నంతలో కొని పెట్టుకుంటారు.
దేశం విలువను పెంచుతుంది..
నిజానికి బంగారం ఓ ఇంటికైనా.. దేశానికి అయినా చాలా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. రేట్లతో సంబంధం లేకుండా అవసరం వచ్చినప్పుడు టక్కున డబ్బులు వచ్చేది బంగారంతోనే. భూమి అయినా.. మరేదానిపై అయినా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని డబ్బుగా మార్చుకోవడానికి మార్కెట్ పరిస్థితులు కలసి రావాలి. గోల్డ్‌కు ఆ పరిస్థితి ఉండదు. ఎక్స్‌పెక్ట్ చేసిన రేటుకు కాస్త అటుఇటుగా అయినా.. స్పాట్‌లో గోల్డ్‌ను క్యాష్ కిందకు కన్వర్ట్ చేసుకోవచ్చు. అమ్మడం ద్వారా అయినా తాకట్టు పెట్టినా బంగారం.. ఆపదలో అండగా నిలుస్తుంది. వేరే వ్యక్తుల నుంచి హెల్ప్ తీసుకోకుండా గడ్డుకాలంలో పరిస్థితులను నెట్టుకురావడానికి గోల్డ్ చాలా ఉపయోగపడుతుంది. బంగారం నిల్వలు దేశ ఆర్థిక పటిష్టతకు, స్థిరత్వానికి నిదర్శనం. ఏ దేశమైనా ఎంత పటిష్టంగా ఉందో తెలియాలంటే.. ఆ దేశ గోల్డ్ నిల్వలను బట్టే నిర్ధారిస్తారు. గోల్డ్ నిల్వల విషయంలో వరల్డ్‌లోనే రిచ్చెస్ట్ కంట్రీగా ఉంది అమెరికా. భారత్ కూడా అంతోఇంతో బంగారం కొని పెట్టుకుంటుంది. ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్‌లో 19 టన్నుల గోల్డ్ సమకూర్చుకుంది. గతేడాది 16 టన్నులను కొనుగోలు చేసింది. 2022లో 34 టన్నులు, 2021లో 77 టన్నుల బంగారాన్ని సేకరించింది. 2009 తర్వాత 200 టన్నుల గోల్డ్‌ను భారత్ సమకూర్చుకుంది.
విపత్కర పరిస్థితుల్లో భరోసా ..
యుద్ధం, ఆర్థిక సంక్షోభం.. ఆపద ఏదైనా ఆదుకునేది బంగారమే. ఇల్లు అయినా కోట్లమంది జనం ఉన్న దేశానికి అయినా విపత్కర పరిస్థితుల్లో భరోసా కల్పించేది గోల్డే. అందుకే వెయ్యి రూపాయల దగ్గర మొదలైన బంగారం ప్రస్థానం.. ఇప్పుడు రూ. 75వేల దగ్గర వరకు వచ్చింది. అప్పుడప్పుడు రేటు తగ్గినా.. పెరిగినా.. పసిడి జిల్ జిగేల్ మంటూ పరుగెడుతోంది. జనం దగ్గరి నుంచి గోల్డ్‌కు ఆదరణకూడా అలాగే పెరుగుతోంది. ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నా బంగారం అనేది టాప్ ప్రయారిటీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మిగతా చాలా రంగాలు ఉన్నప్పటికీ.. బంగారం కొని పెట్టుకోవడం అనేది జనాలకు అలవాటు అయిపోయింది. పసిడి రేట్లు పరుగులు పెడుతుండటం కూడా కలసి వస్తుంది. అందుకే ఈ మధ్య గోల్డ్ సేల్స్ పెరిగాయి. అంతేకాదు.. గోల్డ్ ఉండటం ఎంత ముఖ్యమో.. ఓ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడో.. దేశానికి కష్ట సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. బంగారం వ్యాల్యూ అనేది నార్మల్ పబ్లిక్‌కు తెలుసు. దేశాలకు కూడా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు.. బంగారం విలువ ఏంటో స్పష్టం అవుతుంది. అమెరికా, చైనా ఎందుకు రేపన్నదే లేకుండా గోల్డ్ కొని పెట్టుకుంటున్నాయో కూడా అర్థం అవుతుంది. అందుకే చిన్న పెద్ద దేశమని లేకుండా ఆర్థిక స్థోమతను.. నగదు నిల్వలను బట్టి బంగారం కొని పెట్టుకుంటున్నాయి దేశాలు.
అమెరికాదే అగ్రస్థానం ..
యుక్రెయిన్, రష్యా వార్ అయినా.. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితులు అయినా అందరి భరోసా బంగారమే. తమ దగ్గర ఇప్పటికే ఉన్న గోల్డ్ నిల్వలతోనే వెనక్కి తగ్గడం లేదు పలు దేశాలు. అయితే బంగారం నిల్వలు కూడా ఆ దేశ కరెన్సీ వ్యాల్యూను డిసైడ్ చేస్తాయి. అమెరికా దగ్గర ప్రపంచ దేశాల్లో ఏ కంట్రీ దగ్గర లేనంత గోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. అందుకే డాలర్ వ్యాల్యూ వరల్డ్‌లోనే చాలా ఎక్కువ. అందుకే చైనా కూడా అడ్డగోలుగా గోల్డ్ కొని పెట్టుకుంటుంది. ఇవాళ కాకపోతే రేపు అయినా అగ్రరాజ్యాన్ని దాటి కరెన్సీ విలువను పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది డ్రాగన్ కంట్రీ.
గోల్డ్ ఈజ్ అల్వేస్ గోల్డ్ ..
పూర్వకాలంలో కూడా బంగారం, వజ్రవైఢూర్యాలే రాజులు, రాజ కుటుంబాల ఆస్తి. రాసులుగా పోసి ఉన్న వజ్రాలు, విలువైన బంగారు ఆభరణాలే ఆ కాలంలో రాజ్యాలను కాపాడాయి. ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు మారాయి. అయినా బంగారంకు ఇచ్చే విలువ మాత్రం తగ్గడం లేదు. అందుకే గోల్డ్ ఈజ్ అల్వేస్ గోల్డ్. అది పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. అందుకే బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడమనేది సరైన నిర్ణయంగా చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్. ఓ వ్యక్తి మొత్తం పెట్టుబడుల్లో కనీసం ఐదు శాతం బంగారంపై ఇన్వెస్ట్ చేయాలంటున్నారు నిపుణులు. అయితే ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఫిజికల్‌గా గోల్డ్ కొనడం అంత కరెక్ట్ కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు.. బంగారం బాండ్లు, గోల్డ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసేలా కొత్తగా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా స్టాక్ మార్కెట్లలాగే రెగ్యులర్‌గా మానిటరింగ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఫిజికల్‌గా బంగారం కొంటే జీఎస్టీలు భరించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్, సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకం ద్వారా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే .. అనవసర భారాలు మోయాల్సిన అవసరం ఉండదంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్.