UPI Transactions
UPI Transactions : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధించనున్నారా? యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటుపై సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన తమకు అందలేదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
ద్రవ్య విధాన ప్రకటన తర్వాత జరిగిన (UPI Transactions) విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర బ్యాంకు పరిశీలనలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి ఏళ్లలో యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయన్నారు. కానీ, యూపీఐ రుసుము విధించే ప్రతిపాదన తమకు అందలేదని గవర్నర్ మల్హోత్రా అన్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్లకు యూపీఐ కీలకంగా మారిందని గవర్నర్ మల్హోత్రా తెలిపారు.
యూపీఐ పేమెంట్లపై ఛార్జీలంటూ పుకార్లు :
గత కొన్ని నెలలుగా యూపీఐ లావాదేవీలపై రుసుములు విధించవచ్చని పుకార్లు వస్తున్నాయి. వివిధ సోషల్ మీడియా పోస్ట్‌లు భారీగా వైరల్ అయ్యాయి. అయితే, ఆర్బీఐ యూపీఐ ఛార్జీలపై పూర్తిగా స్పష్టం చేసింది. యూపీఐపై ఎలాంటి ఛార్జీలు విధించే పరిస్థితి ప్రస్తుతానిక లేదని మల్హోత్రా పేర్కొన్నారు. అయితే, యూపీఐ లావాదేవీల ఖర్చులు ఎవరో ఒకరు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
“యూపీఐ ఎప్పటికీ ఉచితమని నేను ఎన్నడూ చెప్పలేదు. ఖర్చులు, యూపీఐ లావాదేవీలతో సంబంధం ఉంటుంది. ఈ ఖర్చులను ఎవరో ఒకరు చెల్లించాలి. చెల్లింపుదారుడి గుర్తింపు ముఖ్యమైనది కానప్పటికీ, ఖర్చులు భరించడం అనేది సమిష్టిగా లేదా వ్యక్తిగతంగా అయినా ఉండొచ్చు. చెల్లింపు వ్యవస్థ దీర్ఘకాలిక స్థిరత్వానికి కీలకమని ఆయన స్పష్టం చేశారు.
ఆర్బీఐ డేటా ప్రకారం.. యూపీఐ లావాదేవీలు ఆగస్టు 2025లో 20 బిలియన్లకు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే.. 34 శాతం పెరిగింది. పేమెంట్ సిస్టమ్ ఈజీగా యాక్సస్ చేయడమే కాకుండా ఎంతో సురక్షితమైనది కూడా. అలాంటి యూపీఐ పేమెంట్లపై అదనపు ఖర్చులను ఎవరైనా భరిస్తేనే అది స్థిరంగా ఉంటుంది. అది ప్రభుత్వం లేదా మరొకరు కావొచ్చు. అది ఎవరు అనేది ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏదైనా సర్వీసుకు అయ్యే ఖర్చులను సమిష్టిగా లేదా వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు.
ఇదిలా ఉండగా, ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది. రెపో రేటును 5.5 శాతంగా ఉంచింది. సెప్టెంబర్ 29న ప్రారంభమైన 3 రోజుల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఆర్బీఐ గవర్నర్ ఈ ఏడాదికి వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను కూడా ప్రకటించారు. మునుపటి అంచనా 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచారు. త్రైమాసిక అంచనాలు Q2కి 7 శాతం, Q3కి 6.4 శాతం, Q4కి 6.2 శాతంగా ఉన్నాయి.