బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారా..? అయితే, మీకు గుడ్‌న్యూస్.. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల్లో ఈ విషయాలు గుర్తించారా..

గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? అయితే, ఆర్బీఐ కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలను ఇక్కడ తెలుసుకోండి..

Gold Loans

Gold Loans RBI: భారతదేశంలో మధ్య తరగతి వర్గాల ప్రజలు.. ధనికులు డబ్బు అవసరం ఉన్నప్పుడు బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవటం సర్వసాధారణం. అయితే, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారిని చాలా మంది వ్యాపారులు మోసం చేస్తున్నారు. రకరకాల కారణాలు చెబుతూ తక్కువ లోన్ ఇస్తున్నారు. అంతేకాదు.. లోన్ కోసం కట్టే లెక్కలు కూడా మోసపూరితంగా ఉంటున్నాయి. ఇవన్నీ గమనించిన కేంద్ర ఆర్థిక శాఖ గోల్డ్ లోన్లకు సంబంధించి కచ్చితమైన రూల్స్ జారీ చెయ్యాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి సూచించింది. దీంతో ఆర్బీఐ తాజాగా.. బంగారం రుణాలపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

 

గోల్డ్ లోన్ ఎల్‌టీవీ రేషియో పెంపు..
బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) రేషియోను ఆర్బీఐ పెంచింది. రుణం రూ.2.5 లక్షలలోపు ఉంటే తనఖా పెట్టిన బంగారం విలువలో 85శాతం వరకు అప్పు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది 75శాతం మాత్రమే ఉంది. 2.5లక్షలు రూ.5లక్షల మధ్య రుణ గ్రహీతలకు 80శాతంగా ఎల్‌టీవీ నిష్పత్తిని నిర్ణయించింది. రూ.5లక్షలకుపైగా గోల్డ్ లోన్లు తీసుకునేవారికి ఎల్‌టీవీ రేషియో 75శాతంగా వర్తిస్తుంది. ఎల్టీవీ రేషియో రుణం తీసుకునే రోజు తనఖా కోసం తెచ్చి బంగారం విలువపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. తులం బంగారం తాకట్టుపెట్టి లోన్ తీసుకోవాలనుకుంటే.. లోన్ తీసుకునే రోజు తులం బంగారం ధర రూ.80వేలుగా ఉందంటే.. మీకు గరిష్ఠంగా రూ.68వేలు రుణం (80వేలలో 85శాతం)గా వర్తిస్తుంది.

కిలోకు మించి రుణాలు ఇవ్వొద్దు..
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కిలోకు మించి బంగారం నగలు తాకట్టు పెట్టుకొని రుణాలు మంజూరు చేయరాదు. వెండి ఆభరణాలైతే ఈ పరిమితి 10 కిలోలు. బంగారం నాణేలైతే 50 గ్రాములు మించరాదు. వెండి నాణేల తాకట్టుకు 500 గ్రాముల పరిమితి విధించారు. తనఖా పెట్టిన బంగారం లేదా వెండిని వాస్తవిక ప్యూరిటీ (క్యారెట్స్) ఆధారిత ధరల ప్రకారమే తీసుకోవాలి.

వాటిపై లోన్ రాదు..!
ఆర్బీఐ నూతన మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై రుణదాతలు ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్ లు) లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా రుణాలను మంజూరు చేయడానికి వీల్లేదు. అంటే.. మీరు డిజిటల్ రూపంలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ పొందలేరు. భౌతికంగా ఉన్న బంగారం ఆధారంగా మాత్రమే గోల్డ్ లోన్స్ తీసుకోవాలి.

వివరాలు ఖచ్చితంగా ఉండాలి..
గోల్డ్ లోన్ తీసుకున్న సమయంలో రుణదాతకు, రుణ గ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సిన వివరాలను కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను, వాటి విలువను కచ్చితంగా పేర్కొనాలి. అప్పు తిరిగి చెల్లించకపోతే వేలం ప్రక్రియ ఎలా ఉంటుంది..? దానికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్ లో స్పష్టంగా ఉండాలి. వేలానికి ముందు అప్పును తిరిగి చెల్లించేందుకు రుణ గ్రహీతకు ఇవ్వాల్సిన నోటీసు వ్యవధిని కూడా పేర్కొనాలి. ఒకవేళ తిరిగి చెల్లించకపోతే.. వేలం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లించే వివరాలను కూడా డాక్యుమెంట్ లో పేర్కొనాలి.