Auto Expo 2025
Auto Expo 2025 : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో సంచలనం సృష్టించింది. ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కస్టమర్ల కోసం కొత్త స్కూటర్లు, బైక్‌లతో నాలుగు కొత్త వెహికల్స్‌ను హీరో కంపెనీ లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో కొత్త హీరో జూమ్ 125, జూమ్ 160, ఎక్స్‌పల్స్ 210, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ ఉన్నాయి.
Read Also : Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోలో కొత్త BMW X3 లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
కంపెనీని విస్తరించే వ్యూహంలో భాగంగా ప్రీమియం మోటార్‌సైకిల్, స్కూటర్లను ఆఫర్ చేస్తోంది. ఈ బైక్‌లు కాకుండా, 2 కొత్త స్కూటర్లు జూమ్ 125, జూమ్ 160 కూడా విడుదల అయ్యాయి. హీరో మోటోకార్ప్ ఈ బైక్‌లు, స్కూటర్‌ల బుకింగ్ వచ్చే నెల ఫిబ్రవరి 2025 నుంచి ప్రారంభించనుంది. మార్చి 2025 నుండి ఈ వాహనాలను హీరో డెలివరీ చేయనుంది.
భారత్‌లో హీరో జూమ్ 125 ధర
హీరో కంపెనీ 125cc సెగ్మెంట్లో కొత్త జూమ్ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 86 వేల 900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ స్కూటర్ కేవలం 7.6 సెకన్లలో 0 నుంచి 60కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ సెగ్మెంట్లో ఈ స్కూటర్ అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా అవతరించింది. ఈ స్కూటర్‌లో 14 అంగుళాల చక్రాలు పెద్ద టైర్‌లతో ఉంటాయి. మీ రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది.
హీరో జూమ్ 160 ధర :
హీరో జూమ్ 160 స్కూటర్ విషయానికి వస్తే.. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో విడుదల అయిన కంపెనీ మొదటి స్కూటర్. ఈ స్కూటర్ ధర రూ. 1,48,500 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
హీరో ఎక్స్‌పల్స్ 210 ధర :
హీరో ఎక్స్‌పల్స్ (Hero Xpulse 210) అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఆఫ్-రోడింగ్‌లో గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ రెండు వేరియంట్‌లలో విడుదల అవుతుంది. ఈ బైక్ ధర రూ. 1,75,800 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌లో 24.6bhp పవర్, 20.7Nm టార్క్ ఉత్పత్తి చేసే 210cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ ధర :
హీరో ఎక్స్‌ట్రీమ్ (Hero Extreme 250R) ధర రూ. 1 లక్ష 80 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ బైక్‌లో 250సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది. 30బీహెచ్‌పీ పవర్, 25ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.
ఈ కొత్త ఆఫర్‌లు పట్టణ ప్రయాణికుల నుంచి అడ్వెంచర్ ఔత్సాహికులు, ప్రీమియం సెగ్మెంట్ కొనుగోలుదారుల వరకు విభిన్న ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో హీరో ఈ వెహికల్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం ఉత్పత్తులు, అధునాతన ఫీచర్లపై దృష్టి సారిస్తూ హీరో మోటోకార్ప్ భారత ద్విచక్ర వాహన మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.
హీరో మోటోకార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ.. ఆవిష్కరణ, స్థిరత్వం పట్ల కంపెనీ నిబద్ధతను ఆయన హైలైట్ చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా హీరో 95శాతం వాహన విడిభాగాలను భారత మార్కెట్లోనే కొనుగోలు చేస్తుంది. ప్రీమియా స్టోర్ల సంఖ్యను 6 నెలల్లో 60 నుంచి 100కి పైగా పెంచడం ద్వారా ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also : Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 100కి పైగా వాహనాల ప్రదర్శనలు!