ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సమాజంపై తనకు ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. విప్రోలో తనకు చెందిన 34 శాతం (రూ.52,750 కోట్ల విలువైన) ఈక్విటీ షేర్లను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చేశారు. ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలు ఉన్నాయని, వీటి మార్కెట్ విలువ రూ.52,700 కోట్లుగా అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రకటించింది. సమాజసేవ చేయడం కోసం అజీజ్ ప్రేమ్‌జీ ఈ ఫౌండేషన్‌ను స్థాపించగా.. ఈ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రేమ్‌జీ కేటాయించిన మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు).
Read Also : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు ఇబ్బందులు.. సైబర్ దాడులు జరిగాయా?
దేశంలోని విద్యా సంబంధిత కార్యక్రమాలతోపాటు.. స్వచ్ఛంద సంస్థలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సాహాయం చేస్తుంటుంది. కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్‌లో అజీజ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తుంది.
జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు కోసం ఈ ఫౌండేషన్ కృషి చేస్తుంది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంను కూడా ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. రాబోయే కొన్నేళ్లలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్టు ఫౌండేషన్ వెల్లడించింది.