ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సెప్టెంబరు 26 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంకు అధికారుల సంఘాలు నిర్ణయించాయి.
ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను 4 పెద్ద బ్యాంకులుగా విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సెప్టెంబరు 26 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంకు అధికారుల సంఘాలు నిర్ణయించాయి. అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఇన్‌బాక్), బ్యాంకు అధికారుల జాతీయ సంఘటన (నోబో) ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఉమ్మడిగా నోటీసు పంపాయి.
బ్యాంకుల విలీనం ప్రక్రియను నిరసిస్తూ సెప్టెంబర్ 20న పారమెంటు భవనం ఎదుట ధర్నా చేయనున్నట్టు బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (యూఎ్‌ఫబీయూ) తెలిపింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుగా విలీనం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఆంధ్రా బ్యాంకు సహా దేశంలోని 10 పెద్ద బ్యాంకులను విలీనం చేసి 4 బ్యాంకులుగా మార్చనున్నట్టు ప్రభుత్వం 2019, ఆగస్టు 30న తెలిపింది.
బ్యాంకు అధికారుల డిమాండ్లు
తమ డిమాండ్లకు మద్దతుగా నవంబర్ రెండో వారం నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని యూనియన్ నాయకుడు తెలిపారు. బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని దినాలను తక్షణం పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, నగదు లావాదేవీల వ్యవధిని తగ్గించాలని, నియంత్రిత పని గంటలు కూడా అమలు పరచాలని బ్యాంకు అధికారుల సంఘాలు కోరుతున్నాయి. ఇవి కాకుండా విజిలెన్స్ కేసులకు సంబంధించిన విధివిధానాల్లో బయటి ఏజెన్సీల అనవసర జోక్యాన్ని నివారించాలని, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. బ్యాంకు శాఖల్లో తగినంత సిబ్బందిని నియమించాలని, ఎన్‌పిఎస్ రద్దు చేయాలని, వినియోగదారులకు సర్వీసు చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పనితీరు బాగోలేదన్న సాకుతో అధికారులను వేధించడం మానుకోవాలన్నారు.ఈ డిమాండ్లకు మద్దతుగా సెప్టెంబరు 25న అర్ధరాత్రి నుంచి 27 అర్ధరాత్రి వరకు సమ్మె చేయనున్నట్టు బ్యాంకు సంఘాలు ప్రకటించాయి.