Loan Foreclosure : ఇంటి, కారు లోన్ క్లోజ్ చేస్తున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు!

Loan Foreclosure : మీ కారు లేదా ఇంటి లోన్ ముందుగానే క్లోజ్ చేయాలని భావిస్తున్నారా? లోన్ కాల పరిమితి ముగియక ముందే మొత్తం చెల్లించాలనుకుంటే కొన్ని విషయాలపై తప్పక అవగాహన ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Loan Foreclosure

Loan Foreclosure : మీరు ఏదైనా లోన్ తీసుకున్నారా? అయితే, మీరు ఎంచుకున్న కాల పరిమితి కన్నా ముందుగానే లోన్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. మీరు నిర్దేశిత సమయానికి ముందే రుణాన్ని క్లోజ్ చేస్తే.. ఆయా బ్యాంకు ఛార్జీల గురించి ముందుగానే తెలుసుకోవాలి.

చాలా బ్యాంకులు రుణాన్ని ముందస్తుగా చెల్లించినందుకు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు విధిస్తాయి. ఇది ఎక్కువగా వ్యక్తిగత రుణాలు, కారు రుణాల విషయంలో కనిపిస్తుంది. రుణం చెల్లించే ముందు, మీరు ఈ ఛార్జీల గురించి కూడా తప్పక సమాచారం తెలుసుకుని ఉండాలి.

Read Also : Personal Loan : మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారా? ఈ 3 తప్పులు అసలు చేయొద్దు.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే..!

చాలా మంది రుణం తీసుకుని ఇల్లు లేదా కారు కొనాలనే కల నెరవేర్చుకుంటారు. ఈ రుణాలు దీర్ఘకాలికమైనవి. చాలా మంది 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల కాలానికి కారు రుణాలు, దాదాపు 20 ఏళ్ల కాలానికి గృహ రుణాలు తీసుకుంటారు.

తద్వారా వారు తక్కువ ఈఎంఐలను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రుణం తిరిగి చెల్లించేటప్పుడు అమ్మయ్యా అప్పు తీరిందని ఊపిరి పీల్చుకుంటారు. కానీ, లోన్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఒక పని చేయకపోతే, మీ ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి.

లోన్ క్లోజ్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి :

మీరు లోన్ ముందుగానే క్లోజ్ చేయాలనుకుంటే.. బ్యాంకుల ఛార్జీల గురించి ముందుగానే తెలుసుకోండి. చాలా బ్యాంకులు రుణాన్ని ముందస్తుగా చెల్లించినందుకు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు విధిస్తాయి. ఎక్కువగా పర్సనల్ లోన్లు, కారు రుణాల విషయంలోనే జరుగుతుంది. లోన్ పూర్తిగా చెల్లించే ముందు, మీరు ఈ బ్యాంకు హిడెన్ ఛార్జీల గురించి కూడా తెలుసుకుని ఉండాలి.

లోన్ మొత్తం చెల్లించిన తర్వాత, మీరు బ్యాంకు నుంచి (NOC) అంటే.. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు రుణాన్ని పూర్తిగా చెల్లించారని రుజువు చేస్తుంది. ఈ ఒక్క డాక్యుమెంట్ తరువాత వచ్చే అనేక సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఎన్ఓసీలో మీ పేరు, బ్యాంకు రుణ వివరాలు మొదలైన అవసరమైన అన్ని సమాచారం ఉండాలని గుర్తుంచుకోండి.

రుణం చెల్లించిన తర్వాత, బ్యాంకుకు సమర్పించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాంకు నుంచి తిరిగి తీసుకోండి. పవర్ ఆఫ్ అటార్నీ, ఆస్తి పత్రాలు, క్యాన్సిల్ చెక్కు వంటివి తప్పకుండా తీసుకోవడం మర్చిపోవద్దు.

Read Also : జీతం చాలట్లేదు.. అప్పులు క్లియర్ చేసేద్దాం అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ మిస్టేక్స్ చేయొద్దు..

చాలా సందర్భాలలో, రుణం తీసుకున్న తర్వాత బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తిపై బ్యాంకు తాత్కాలిక హక్కు లేదా పరిమితిని విధిస్తుంది. రుణం తిరిగి చెల్లించిన తర్వాత అది తొలగించాలని బ్యాంకును అభ్యర్థించండి.

చాలా సార్లు, మీరు లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా మీ (CIBIL) స్కోర్‌లో బకాయి మొత్తం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సమస్యలు తలెత్తవచ్చు. లోన్ క్లోజ్ అయినట్టుగా అప్‌డేట్ చేయమని మీ లోన్ ఇచ్చిన బ్యాంకును అడగండి.