Elon Musk: పోతుంది.. మొత్తం ఆవిరైపోతుంది.. మస్క్ కి రూ.8.9 లక్షల కోట్ల నష్టం..
ఈ ఏడాది ప్రారంభం నుంచి టెస్లా షేర్లు భారీగా పతనం కావడంతో బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపద విలువ భారీగా తగ్గింది.

Elon Musk
Elon Musk: ఈ ఏడాది ప్రారంభం నుంచి టెస్లా షేర్లు భారీగా పతనం కావడంతో బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువ 102బిలియన్ల డాలర్లు తగ్గింది. అంటే.. జస్ట్ 67 రోజుల్లోనే 8.9లక్షల కోట్లను మస్క్ నష్టపోయాడు. ఈ మొత్తం యునైటెడ్ పార్సెల్ సర్వీస్ మొత్తం మార్కెట్ విలువకు దాదాపు సమానంగా ఉంటుంది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 2021 నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఎలాన్ మస్క్ నికర సంపద 433 బిలియన్ డాలర్లు ఉండగా.. ఫిబ్రవరి నెలాఖరు నాటికి 349 బిలియన్ డాలర్లకు తగ్గింది. ప్రస్తుతం అతని నికర సంపద దాదాపు 330 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మస్క్ సంపద 24శాతం తగ్గింది. ఈ సంవత్సరం టెస్లా షేర్ల ధరలు దాదాపు 404 డాలర్ల నుంచి 263 డాలర్లకు అంటే 35శాతం పడిపోయాయి. దీంతో మస్క్ సంపదపై భారీ ప్రభావం చూపింది. అమ్మకాల కారణంగా దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 400 బిలియన్ డాలర్లు తగ్గి 900 బిలియన్ల డాలర్ల కంటే తక్కువ చేరుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, మెక్సికో, కెనడా దేశాలపై సుంకాలు విధించడంతో గురువారం టెస్లా షేర్లు S&P 500తో పాటు పతనమైంది. ఇది పెట్టుబడిదారుల్లో ఆందోళనను కలిగించింది. నవంబర్ నెలలో ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తరువాత టెస్లా షేర్లు భారీగా పెరిగాయి. అమెరికన్ ఆటోమేకర్ల మాదిరిగానే టెస్లా తన కార్లను కెనడా నుంచి దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించి తయారు చేస్తుంది. ఇదిలాఉంటే.. ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మస్క్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. మెటాకు చెందిన మార్క్ జుకర్‌బర్గ్ 236 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడు కాగా, అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ 232 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించేందుకు డోజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.