Budget 2025 : ఈసారి బడ్జెట్‌లో రైతన్నలకు తీపికబురు.. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 5 లక్షలకు పెంచే ఛాన్స్!

Budget 2025 - Kisan Credit Card Limit : రాబోయే బడ్జెట్‌లో రైతన్నలకు తీపికబురును కేంద్రం అందించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kisan Credit Card Limit May Be Raised to Rs 5 Lakh

Budget 2025 – Kisan Credit Cards : రాబోయే బడ్జెట్ ప్రకటనకు ముందుగానే వ్యవసాయం సహా వివిధ రంగాలు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రైతులు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రోత్సాహకాలు అందజేయాలని కోరుతున్నారు.

ఇటీవలి బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ (KCC) కోసం క్రెడిట్ పరిమితిని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Budget 2025 : మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పొడిగిస్తారా? ఫిబ్రవరి 1న బడ్జెట్‌పైనే గంపెడు ఆశలన్నీ..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి ఇంకా కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని నిపుణుల అంచనా.

సాధారణ మధ్యతరగతి నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ ఎంతో ఆశగా బడ్జెట్ ద్వారా తమకు ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయా? అని ఎదురుచూస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడే రైతన్నలు కూడా భారీగానే ఆశలు పెట్టేసుకున్నారు. వచ్చే బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెరిగే అవకాశం :
అదేగాని జరిగితే.. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిపై అందించే రూ.3 లక్షల ప్రయోజనాన్ని రూ.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే యోచనలో ఉన్నట్లుగా పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం, కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు రూ.3 లక్షల రుణ పరిమితిని అందిస్తోంది. అయితే, ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. కేసీసీ పరిమితి చాలా కాలంగా సవరించలేదని, దానిని పెంచడం ద్వారా రైతుల అవసరాలను మరింత సమర్థవంతంగా పరిష్కరించవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ చర్యతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి, రైతులకు ఆర్థిక సహాయాన్ని పెంపొందించడానికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

కేవలం 4శాతం వడ్డీతో రుణాలు :
కేసీసీ పథకం కింద రైతులు ప్రస్తుతం 9శాతం వడ్డీ రేటుతో రుణాలు పొందుతున్నారు. అయితే, ప్రభుత్వం 2శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది. అదనంగా, రుణాన్ని సకాలంలో చెల్లించినట్లయితే, రైతులు మరో 3శాతం వడ్డీ రాయితీని పొందుతారు. తద్వారా వడ్డీ రేటును కేవలం 4శాతానికి తగ్గించవచ్చు. 1998లో ప్రవేశపెట్టిన కేసీసీ (KCC) స్కీమ్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చింది.

Read Also : Budget 2025 : పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్ న్యూస్.. కొత్త పన్ను విధానంలో ఈ 5 ముఖ్యమైన మినహాయింపులు ఉండవు.. తప్పక తెలుసుకోండి!

తదుపరి ప్రకటనలపై రైతుల అంచనా :
కేసీసీ పరిమితి పెంపుతో పాటు, బడ్జెట్‌లో ఇతర ముఖ్యమైన ప్రకటనలపై కూడా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పంటల బీమా పథకం), పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి కార్యక్రమాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతం, రైతులు కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా రూ.2వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేలు అందుకుంటున్నారు. రాబోయే బడ్జెట్‌లో ఈ పథకాలకు ఆర్థిక సహాయం లేదా మెరుగుదలలు పెరుగుతాయని చాలా మంది ఆశిస్తున్నారు.