Budget 2025 : మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పొడిగిస్తారా? ఫిబ్రవరి 1న బడ్జెట్‌పైనే గంపెడు ఆశలన్నీ..!
Budget 2025 : ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ చివరి తేదీ పొడిగిస్తారా? లేదా అనేది ఆసక్తి నెలకొంది.

Budget 2025
Budget 2025 : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ సమర్పణకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. శనివారం అంటే.. ఫిబ్రవరి 1వ తేదీన, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే, 6 నెలల్లో రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు.
అంతకుముందు, జూలై 2024లో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆమె తన 7వ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ ఏడాది నిర్మలమ్మ బడ్జెట్‌పై పన్ను రేట్లు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాల పెంపు, మినహాయింపులు వంటి ప్రకటనలపై అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అదే సమయంలో, ప్రభుత్వం మహిళలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటనలను కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా, మహిళలు, బాలికలకు సంబంధించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ (MSSC)పైనే జోరుగా చర్చ కొనసాగుతోంది.
ఈ స్కీమ్ 2023 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించగా, త్వరలో గడువు ముగియనుంది. ఈ స్కీమ్ విషయంలో రాబోయే బడ్జెట్‌లో పొడిగింపు ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే గడువు తేదీ దాటినా కేంద్ర ప్రభుత్వం ఈ మహిళా స్కీమ్ కొనసాగిస్తుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
‘మహిళా సమ్మాన్’ స్కీమ్ గడువు తేదీ పొడిగిస్తారా? :
వాస్తవానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర బడ్జెట్ 2023 మహిళా సమ్మాన్ బచత్ యోజనను ప్రకటించారు. ఈ వన్-టైమ్ స్కీమ్‌లో, బాలికలు, మహిళలు 2 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ వడ్డీని పొందుతారు.
దీని కారణంగా ఇది మహిళలకు గొప్ప సేవింగ్స్ స్కీమ్‌గా ఉద్భవించింది. అయితే, మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ చివరి తేదీ సమీపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో, ఫిబ్రవరి 1 న సమర్పించే బడ్జెట్‌లో ఈ ప్రభుత్వ పథకానికి చివరి తేదీని పొడిగించవచ్చని భావిస్తున్నారు.
‘మహిళా సమ్మాన్’ గడువు తేదీ ఇదే :
ప్రస్తుతం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ 31 మార్చి 2025 వరకు ఉంది. అటువంటి పరిస్థితిలో, మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ గడువును మళ్లీ పెంచుతున్నట్టు ప్రకటించే అవకాశం ఉంది.
ఈ స్కీమ్ కింద రూ.2 లక్షల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. అంతేకాదు.. 7.5శాతం వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. డిపాజిట్‌దారులు ఎవరైనా తమకు అవసరమైతే ఒకసారి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంది. ఈ స్కీమ్ కింద కనీసంగా రూ. వెయ్యి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అత్యధికంగా రూ.2 లక్షల వరకు అనుమతిస్తారు. డిపాజిట్‌దారులకు వార్షిక వడ్డీ 7.5శాతంగా అందిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీని గణించి అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఈ మొత్తాన్ని కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లించడం జరుగుతుంది.