ఈ-కామర్స్ కంపెనీలపై కస్టమర్లు ఫైర్ : హెల్ప్ లైన్ ఫిర్యాదుల్లో జియో, ఫ్లిప్‌కార్ట్‌ టాప్

  • Publish Date - November 16, 2019 / 09:30 AM IST

ఈ కామర్స్ కంపెనీలు అందించే సర్వీసులపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తునా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా ఈ-కామర్స్ కంపెనీలపై భారీగా ఫిర్యాదులు నమోదైనట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటా వెల్లడించింది. ఇటీవలే మంత్రిత్వ శాఖ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మొబైల్ యాప్ లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకున్న 60 రోజుల్లో సులభంగా పరిష్కారం లభించేలా ఏర్పాటు చేసింది. 

ఇందులో ఎక్కువ ఫిర్యాదులు నమోదైన జాబితాలో జియో, ఫ్లిప్ కార్ట్ కంపెనీలే టాప్ లో ఉన్నట్టు తెలిపింది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్‌ ఏర్పాటు చేసింది. ప్రతి ఐదుగురు ఫిర్యాదుదారుల్లో ఒకరు హెల్ప్ లైన్ ద్వారా ఈ-కామర్స్ కంపెనీలపై ఫిర్యాదు నమోదు చేయగా, వాటిలో ఫ్లిప్ కార్ట్‌ ముందువరుసలో ఉంది. 

ఈ కామర్స్ కంపెనీల తర్వాత బ్యాంకింగ్, టెలికం కంపెనీలపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫ్లిప్ కార్ట్, రియలన్స్ జియో, అమెజాన్, ప్రభుత్వ రంగ బ్యాంకులే టాప్ లో ఉన్నట్టు అధికారి ఒకరు తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులపై ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. కస్టమర్ల సౌకర్యార్థం తమ సర్వీసులను నిరంతరాయంగా మెరుగు పరుస్తున్నామని, వారి సమస్యలను తీర్చేందుకు ఎప్పటికప్పుడూ స్పందిస్తూనే ఉన్నామని చెప్పారు.

ఫ్లిప్ కార్ట్ యాప్ ఎలా నేవిగేట్ చేయాలో కొత్త కస్టమర్లకు గైడ్ చేయడమే కాకుండా పాలసీలు, టర్మ్స్ అండ్ కండీషన్స్ పై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక ఏడాదిలో మిలియన్ల మంది కస్టమర్లకు తమ మార్కెట్ ప్లాట్ ఫాం నుంచి దాదాపు 30 కోట్ల షిప్పింగ్ చేస్తున్నట్టు ఫ్లిప్ కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. 

మరోవైపు రిలయన్స్ జియో ప్రతినిధి మాత్రం వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ అర మిలియన్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో లక్ష వరకు ఫిర్యాదులు ఈ కామర్స్ కంపెనీలపైనే నమోదు అయ్యాయి. 41వేల 600 ఫిర్యాదులు బ్యాంకులకు వ్యతిరేకంగా నమోదు అయ్యాయి. 

ఇక టెలికం కంపెనీలపై 29వేల 400 ఫిర్యాదులు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 5లక్షల 65వేల ఫిర్యాదులు నమోదు కాగా, అందులో ఈ కామర్స్ కంపెనీలపై లక్ష వరకు ఫిర్యాదులు నమోదు అయినట్టు డేటా వెల్లడించింది. 

వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఈ కామర్స్ కంపెనీలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. గత ఏడాదిలో 565వేల ఫిర్యాదులు నమోదు కాగా.. వీటిలో 555వేల  ఫిర్యాదులను పరిష్కరించినట్టు కంపెనీలు వెల్లడించాయి. ఈ ఏడాది కూడా కస్టమర్ల సమస్యలను మరిన్ని పరిష్కరించనున్నట్టు అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ కస్టమర్ల తమ పరిష్కరంపై సంతృప్తి చెందని పక్షంలో తమ స్థానిక నగరాల్లోని వినియోగదారుల ఫోరంను సంప్రదించాలని సూచిస్తున్నట్టు మరో అధికారి తెలిపారు.