Delhi EV Policy 2026 : జూలై 1 నుంచి ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీ.. EV కొంటే క్యాష్.. పాత కారు స్క్రాప్ చేస్తే రూ. లక్ష వరకు లాభం!
Delhi EV Policy 2026: ఢిల్లీ క్యాబినెట్ ఢిల్లీ ఈవీ పాలసీ 2.0కి ఆమోదం తెలిపింది. ఈ కొత్త ఈవీ పాలసీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
Delhi EV Policy 2026
- ఇక పెట్రోల్ వాహనాలకు కౌంట్‌డౌన్
- EV కొనాలనుకుంటున్నారా? జూలై 1 నుంచి గోల్డెన్ ఛాన్స్!
- పెట్రోల్ బైక్‌లకు ఫుల్ స్టాప్.. ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీకి ఆమోదం
- కొత్త EV కొంటే రూ.50 వేల సబ్సిడీ..
Delhi EV Policy 2026 : వాహనదారులకు బిగ్ అలర్ట్.. దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలను) ప్రోత్సహించే దిశగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 29న (సోమవారం) ఢిల్లీ క్యాబినెట్ ‘ఢిల్లీ ఈవీ పాలసీ 2.0’కి ఆమోదం తెలిపింది.
ఈ కొత్త ఈవీ పాలసీ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇదే విషయాన్ని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తెలిపారు. రాజధానిలో స్వచ్ఛమైన, కాలుష్య రహిత రవాణా కోసం ప్రభుత్వం ఈ పథకం కింద రాబోయే నాలుగేళ్లలో రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
ఢిల్లీ ఈవీ పాలసీ 2026 :
కొత్త ఢిల్లీ ఈవీ పాలసీ కింద 2027 నాటికి రాజధానిలో నమోదయ్యే కొత్త వాహనాల్లో 95 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఢిల్లీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా కాలుష్యం తగ్గి, నగర ప్రజలకు పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యాలు లభిస్తాయని భావిస్తోంది.
ఈ పాలసీ కింద రూ. 30 లక్షల లోపు కార్లకు రోడ్డు టాక్స్ జీరోకు తీసుకురావడం, భారీ స్క్రాపేజ్ బోనస్‌లు అందించడం, 2028 నాటికి పెట్రోల్ టూవీలర్ల రిజిస్ట్రేషన్ల పూర్తి నిషేధించడం వంటివి అమలు చేయనుంది.
ఆటోలు, టూవీలర్లకు కొత్త రూల్స్ :
కొత్త ఈవీ విధానం ప్రకారం.. జనవరి 1, 2027 నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటోలు మాత్రమే రిజిస్టర్ అవుతాయి. అలాగే, ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలు అమలు అవుతాయి. అదనంగా, బీఎస్-IV ఫోర్ వీలర్ వాహనాలను స్క్రాప్ చేసే వాహన యజమానులకు రూ. లక్ష వరకు స్క్రాపింగ్ ప్రోత్సాహకం లభిస్తుంది.
ఢిల్లీలో ఈవీ కొనుగోలుపై సబ్సిడీ :
కొత్త ఢిల్లీ ఈవీ పాలసీ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుపై మొదటి ఏడాదిలో ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై రూ. 30వేలు, ఎలక్ట్రిక్ ట్రిపుల్ వీలర్ వాహనాలపై రూ. 50వేలు సబ్సిడీ అందించనుంది. ఎక్కువ మందిని ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకునేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పవచ్చు.
హైబ్రిడ్ వాహనాలకు సబ్సిడీ :
కొత్త ఈవీ కేటగిరీలో రూ. 30 లక్షల వరకు ధర ఉన్న హైబ్రిడ్ వాహనాలకు 50 శాతం రోడ్డు పన్ను మినహాయింపు ఇవ్వాలని భావించారు. అయితే, ప్రస్తుత ఈవీ విధానంలో హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీ, పన్ను మినహాయింపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనేక దేశాలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ అందుబాటులో ఉండగా భవిష్యత్తులో హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
