×
Ad

Union Budget 2026: విద్యారంగంలో అతిపెద్ద మార్పులు ఇవే.. స్టూడెంట్స్‌ తెలుసుకోవాల్సిందే..

విద్యార్థులు నేర్చుకునే నైపుణ్యాలు నేరుగా ఉద్యోగాలు లేదా సొంత వ్యాపార అవకాశాలకు ఉపయోగపడేలా వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా హై పవర్డ్ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని సీతారామన్ ప్రకటించారు.

Union Budget 2026 (Image Credit To Original Source)

  • ఈ ఏడాది విద్యా రంగానికి రూ.1,39,285.95 కోట్లు
  • విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగావకాలు కల్పించేలా మార్పు
  • నైపుణ్యాలు నేరుగా ఉద్యోగాలను ఉపయోగపడేలా వ్యవస్థ

Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది విద్యా రంగానికి రూ.1,39,285.95 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోల్చితే 8.27 శాతం పెంచారు. ఇందులో పాఠశాల విద్య ఖర్చు రూ.83,561.41 కోట్లకు పెరిగింది. ఉన్నత విద్యకు రూ.55,724.54 కోట్లు కేటాయించారు.

విద్యార్థులు నేర్చుకునే నైపుణ్యాలు నేరుగా ఉద్యోగాలు లేదా సొంత వ్యాపార అవకాశాలకు ఉపయోగపడేలా వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా హై పవర్డ్ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని సీతారామన్ ప్రకటించారు. విద్యా రంగంలో ప్రధాన ప్రతిపాదన ఇదే.

వికసిత్ భారత్-2047 లక్ష్యానికి మనదేశ సేవా రంగాన్ని దృష్టిలో ఉంచుకుని హై పవర్డ్ స్టాండింగ్ కమిటీ సూచనలు చేస్తుంది. 2047 నాటికి ప్రపంచ సేవల మార్కెట్‌లో 10 శాతం వాటా సాధించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక మంత్రి వివరించారు. వృద్ధి, ఉపాధి, ఎగుమతుల ప్రాధాన్య రంగాలను ఈ కమిటీ గుర్తిస్తుంది. కృత్రిమ మేధ వంటి అభివృద్ధిలో ఉన్న సాంకేతికతలు ఉద్యోగాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేసి నైపుణ్య అవసరాలపై మార్గదర్శకాలను రూపొందిస్తుంది. కొత్త సంస్థల కంటే విద్య, పరిశ్రమ, కార్మిక రంగాల మధ్య సమన్వయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

Also Read: బడ్జెట్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్‌.. అందులో ‘ధురంధర్‌’ మీమ్స్‌ నెక్ట్స్‌ లెవెల్‌

ఈస్టర్న్‌ ఇండియాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
డిజైన్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, శిక్షణ పొందిన డిజైనర్ల కొరత ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో ఈస్టర్న్‌ ఇండియాలో కొత్తగా నేషనల్ ఇన్‌ట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థను ఛాలెంజ్ రూట్ ద్వారా స్థాపిస్తారు. ప్రాంతీయ అభివృద్ధి అవసరాలు, పరిశ్రమ డిమాండ్‌కు అనుగుణంగా ఇందుకు సంబంధించిన విధానాలు రూపొందిస్తారు.

5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు
ప్రధాన పరిశ్రమ, లాజిస్టిక్స్ కారిడార్ల సమీపంలో 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయటానికి రాష్ట్రాలకు బడ్జెట్ సపోర్ట్ ప్రతిపాదించారు. దీన్ని కూడా ఛాలెంజ్ రూట్ ద్వారానే అమలు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో యూనివర్సిటీలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్య కేంద్రాలు, నివాస సముదాయాలు ఉంటాయి. క్యాంపస్‌లు, ఉపాధి కేంద్రాల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించి సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం పెంచడమే లక్ష్యం.

ప్రతి జిల్లాలో ఎస్‌టీఈఎమ్ బాలికలకు హాస్టల్
ఉన్నత విద్యలో శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్, గణిత (ఎస్‌టీఈఎమ్) రంగాల్లో చదువుతున్న విద్యార్థినులు ఎదుర్కొనే పరిమితులను గుర్తిస్తూ ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో నిర్మల ప్రకటించారు. దీర్ఘకాలిక అధ్యయన సమయాలు, ప్రయోగశాల పనులు విద్యార్థినులకు ఆచరణాత్మక అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి చెప్పారు. స్కాలర్‌షిప్‌లకంటే మౌలిక వసతుల ద్వారా మరిన్ని ప్రయోజనాలు సాధించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశం.

టెలిస్కోప్ సదుపాయాలు
ఖగోళ భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రంలో లోతైన అభ్యాసాన్ని ప్రోత్సహించటానికి నాలుగు టెలిస్కోప్ మౌలిక సదుపాయాల ఏర్పాటు లేదా అప్‌గ్రేడ్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వీటిలో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కోస్మోస్ 2 ప్లానెటేరియం ఉన్నాయి.

ఇంకా..
వైద్య పర్యాటక కేంద్రంగా భారతదేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్రాల సహకారంతో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో ఐదు ప్రాంతీయ వైద్య హబ్‌లు ఏర్పాటు చేసే పథకాన్ని కూడా ప్రకటించారు.

నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యను కూడా గుర్తించి, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్య, వైద్య అవసరాల నిమిత్తం పంపే డబ్బుపై వసూలు చేసే టాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ రేటును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.