ఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్లించకుండా విదేశాలకు పారిపోకుండా చూడాలని సుప్రీంను కోరింది. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకి షాక్ తగిలినట్లైంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్…ఎరిక్‌సన్‌కి చెల్లించాల్సిన బాకీ గడువు తీరిపోయింది. అన్న ముకేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కి ఆర్.కామ్ స్పెక్ట్రమ్ విక్రయించి..అప్పులు తీర్చుకోవాలని భావించింది. కానీ అది కాస్తా రివర్సైంది. ఈ నేపధ్యంలో తాజా పరిణామం కంపెనీ అధినేత అనిల్ అంబానీ పరువుకి డ్యామేజ్ చేసింది. అప్పు కట్టించమని అడగడమే కాకుండా.. అనిల్ అంబానీ సహా సంస్థ గ్రూపు కంపెనీలకు చెందిన ఇతర అధికారులు దేశం విడిచిపోకుండా చూడాలని కోరింది. ఇందుకోసం హోం మంత్రిత్వశాఖకి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గడువు ముగిసినా తమ బాకీ చెల్లించనందుకు కోర్టు ధిక్కారం కింద అనిల్ అంబానీని జైలుకి పంపాలని డిమాండ్ చేసింది ఎరిక్సన్ .