జనవరి 1 నుంచి వారానికి ఐదు రోజులే బ్యాంకులు.. నిజమెంత?

వారానికి ఐదు రోజుల బ్యాంకు పనిదినాలపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముందని వాట్సాప్ మెసేజ్ ఒకటి తిరుగుతోంది. ఇది నిజమా, కాదా అని బ్యాంకు ఉద్యోగులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

Fact Check 5 Days Banking implement from 1 January 2024 what is truth behind

Fact Check: వారానికి ఐదు రోజుల బ్యాంకు పనిదినాలపై మరోసారి జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో ఫైవ్ డేస్ బ్యాంకింగ్ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 2024, జనవరి 1 నుంచి ఫైవ్ డేస్ బ్యాంకింగ్ అమల్లోకి వస్తుందని.. ఒకట్రెండు రోజుల్లో దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముందని వాట్సాప్ మెసేజ్ ఒకటి తిరుగుతోంది. ఇది నిజమా, కాదా అని బ్యాంకు ఉద్యోగులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

”ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫైవ్ డేస్ బ్యాంకింగ్ అంశం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. 2024, జనవరి 1 నుంచి ఫైవ్ డేస్ బ్యాంకింగ్ అమల్లోకి రానుంది. ఒకటి లేదా రెండు రోజులో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది” అంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. తనకు ఈ మెసేజ్ వాట్సాప్‌లో వచ్చిందని, ఇంకెవరికైనా ఈ మెసేజ్ వచ్చిందా అని అభిషేక్ సింగ్ రాజ్‌ఫుత్‌ అనే యూజర్ ఎక్స్(ట్విటర్)లో ఆరా తీశారు. తమకు కూడా ఈ మెసేజ్ వచ్చిందని కొంతమంది నెటిజనులు తెలిపారు.

Also Read: వారానికి ఐదు రోజులే బ్యాంకులు.. ట్రెండింగ్‌లో హాష్ ట్యాగ్.. ఇప్పుడే ఎందుకు?

ఫైవ్ డేస్ బ్యాంకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడైంది. బ్యాంకుల్లో ఐదు రోజుల పని దినాలకు సంబంధించి డిసెంబర్ 5న రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ సమాధానం ఇచ్చారు. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రతిపాదించిందని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించిందా? త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేస్తుందా? అనే విషయాలేవి మంత్రి భగవత్ వెల్లడించలేదు. కాబట్టి వాట్సాప్‌లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రుజువైంది. ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు వాస్తవాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.