October New Rules
October New Rules : బిగ్ అలర్ట్.. వచ్చే అక్టోబర్ 1 నుంచి అనేక కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. పండుగల సీజన్ సమయంలో ఈ కొత్త మార్పులు సాధారణ ప్రజల జీవితాలను ముఖ్యంగా ఆర్థిక, సేవల రంగాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయనుంది. దేశవ్యాప్తంగా 7 ప్రధాన మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు ఆన్‌లైన్ గేమింగ్ నుంచి రైలు టికెట్ బుకింగ్, యూపీఐ, పెన్షన్ ప్లాన్‌ల వరకు నిబంధనలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
రైల్వే టికెట్ బుకింగ్‌కు కఠినమైన నిబంధనలు :
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో (October New Rules) దళారులు, దుర్వినియోగాన్ని నివారించేందుకు IRCTC కొత్త రూల్ అమలు చేసింది. అక్టోబర్ 1 నుంచి ఆధార్-వెరిఫైడ్ ఐఆర్‌సీటీసీ అకౌంట్లు ఉన్న ప్రయాణీకులు మాత్రమే జనరల్ రిజర్వేషన్లు ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లోపు టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. తత్కాల్ టికెట్ బుకింగ్ తరహాలో రూపొందిన ఈ నియమం దళారులను అరికట్టి, సాధారణ ప్రయాణీకులు సులభంగా టిక్కెట్లు పొందవచ్చు.
జాతీయ పెన్షన్ వ్యవస్థలో సంస్కరణలు :
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) జాతీయ పెన్షన్ వ్యవస్థ(NPS)లో భారీ మార్పులను ప్రవేశపెట్టింది. మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) అని కూడా పిలుస్తారు. ఇప్పుడు, ప్రభుత్వేతర రంగ ఉద్యోగులు, కార్పొరేట్ నిపుణులు, గిగ్ వర్కర్లు ఒకే పాన్ నంబర్‌తో మల్టీ NPS పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. దాంతో పెట్టుబడిదారులకు వారి అవసరాల ఆధారంగా పెట్టుబడులను ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు. పదవీ విరమణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
యూపీఐ “కలెక్ట్ రిక్వెస్ట్” లేదా “పుల్ ట్రాన్సాక్షన్” ఫీచర్ అక్టోబర్ 1 నుంచి నిలిచిపోనుంది. మీ స్నేహితుడు లేదా బంధువు నుంచి నేరుగా మనీ రిక్వెస్ట్ ఆప్షన్ ఇకపై యూపీఐ యాప్‌లలో అందుబాటులో ఉండదు. ఆన్‌లైన్ మోసం, ఫిషింగ్‌ను నిరోధించడంలో సాయపడతుందని NPCI పేర్కొంది.
ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠిన చర్యలు :
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమను పారదర్శకంగా, సురక్షితంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేసింది. కొత్త చట్టం ప్రకారం.. గేమింగ్ కంపెనీలను కఠినంగా పర్యవేక్షిస్తారు. గేమ్ ఆడేవారిని మోసాల బారిన పడకుండా రక్షించడం, తద్వారా పరిశ్రమలో పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం.
ఎల్‌పీజీ సిలిండర్ ధరల సవరణ :
ప్రతి నెలా మాదిరిగానే ఆయిల్ కంపెనీలు అక్టోబర్ 1న డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. ప్రపంచ మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ ధరల మార్పులు సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది.
రెపో రేటు, రుణాలపై ఆర్బీఐ నిర్ణయాలు :
రెపో రేటు, ఇతర ఆర్థిక నిర్ణయాలను చర్చించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ ప్రారంభంలో సమావేశమవుతుంది. రెపో రేటు తగ్గింపు గృహ, కారు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. అదే జరిగితే మీ నెలవారీ ఈఎంఐలు భారీగా తగ్గుతాయి.
పీఎఫ్ సభ్యులకు కొత్త సౌకర్యాలు :
పీఎఫ్ సభ్యులకు కొత్త డిజిటల్ సర్వీసులు, పెన్షన్ పెంపుదలపై అక్టోబర్‌లో చర్చించే అవకాశం ఉంది. కనీస పెన్షన్‌ను రూ. 1,000 నుంచి రూ. 1,500 నుంచి రూ.2,500కి పెంచడంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అదనంగా, ఈపీఎఫ్ఓ కొత్త డిజిటల్ సర్వీస్ EPFO 3.0 ప్రారంభించనుంది. ఆన్‌లైన్ PF సేవలు మరింత వేగవంతం కానుంది. తద్వారా పెన్షనర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది.
బ్యాంకుల సెలవుల పొడిగింపు :
పండుగల కారణంగా అక్టోబర్‌లో బ్యాంకులకు మొత్తం 21 సెలవులు ఉండనున్నాయి. ఇందులో దసరా, దీపావళి, లక్ష్మీ పూజ, మహర్షి వాల్మీకి జయంతి, ఛఠ్ పూజ ఉన్నాయి. ఏదైనా బ్యాంకింగ్ పని మీద వెళ్లేటప్పుడు ముందు సెలవుల జాబితాను ఓసారి చెక్ చేయండి.