Gautam Adani success : అంబానీ సైతం చిన్నబోయేలా వ్యాపారంలో పెరుగుతున్న గౌతమ్ అదానీ

కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ వ్యక్తి.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం మారారు. ఎవరూ టచ్ చేయలేని స్థాయిలో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.  ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా ? అదానీ విషయంలో అదే జరిగింది మరి !

Gautam Adani

Gautam Adani success story  : కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ వ్యక్తి.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం మారారు. ఎవరూ టచ్ చేయలేని స్థాయిలో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.  ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా ? అదానీ విషయంలో అదే జరిగింది మరి !

అదాని అనేది ఒక పేరు మాత్రమే కాదు బ్రాండ్ ఇప్పుడు ! దీని వెనక కొన్ని ఏళ్ల కృషి .. అవకాశాన్ని అందుపుచ్చుకునే నైపుణ్యం.. ప్రపంచాన్ని పదేళ్లు ముందుగానే చూసే తత్వం ఉంది. అందుకే ఇప్పుడు అదానీని ఈ స్థానంలో నిలబెట్టింది.

సంపద వృద్ధిలో మస్క్ లాంటి వాళ్లనే వెనక్కి నెట్టారంటే.. అదానీ వ్యాపార చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 16.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్‌ డాలర్లకు చేరింది. ముకేశ్‌ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరిగింది. అంబానీతో పోలిస్తే అదానీ సంపద రెట్టింపు పెరిగింది.

అంబానీ సైతం చిన్నబోయేలా అదానీ ఎదుగుతున్నారు. ఐతే ముఖేష్ తండ్రి వారసత్వాన్ని కొనసాగించగా.. అదానీ మాత్రం ఎవరి అండ లేకుండా ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన జీవితం అందుకే ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తోంది.

టెక్స్‌టైల్ బిజినెస్ ఓనర్ కుమారుడైన గౌతమ్ అదానీ.. కాలేజీ చదువు మధ్యలోనే మానేశారు. డైమండ్ బిజినెస్ కోసం 1980ల్లో ముంబై వెళ్లారు. కానీ కొంత కాలానికే గుజరాత్ తిరిగి వెళ్లి ప్లాస్టిక్ దిగుమతుల వ్యాపారంలో అన్నయ్యకు తోడుగా ఉన్నారు. 1988లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ను స్థాపించారు.

1990ల్లో ముంద్రా పోర్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి అదానీ ప్రవేశించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. బొగ్గు తవ్వకాల్లోకి సైతం అడుగుపెట్టిన అదానీ.. విదేశాలకు సైతం ఈ వ్యాపారాన్ని విస్తరించారు.

వెలుగులు నింపే విద్యుత్ నుంచి వంట నూనె వరకు.. పోర్టుల నుంచి వంట గ్యాసు వరకు.. ప్రతీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ అదానీ గ్రూప్ ముందుకు దూసుకెళ్తోంది. పట్టిందల్లా బంగారం అయినట్లు.. ప్రతీ రంగంలోనూ విజయమే వరించింది. ప్రతీ వ్యాపారం లాభాల బాటే పట్టింది.

బయటి నుంచి ఎలాంటి విమర్శలు ఎదురైనా… అదానీ మాత్రం పర్ఫెక్ట్, పక్కా వ్యాపారవేత్త. అనుకున్నది చేయగలరు.. చేసిందాంట్లో విజయం సాధించగలరు అన్న పేరు సంపాందించుకున్నారు ఆయన! ఐతే ఇప్పుడు తీరంలో వ్యాపార సామ్రాజ్యం విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ సమయంలో.. అదానీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అన్న చర్చ ప్రతీ ఒక్కరిలో వినిపిస్తోంది.

అంబానీ నుంచి సక్సెస్‌ఫుల్ అనిపించుకున్న ఏ వ్యాపారి ధోరణి చూసినా.. దానికి డిఫరెంట్ అనిపిస్తుంటారు అదానీ ! ఒకదానితో ఇంకోదానికి సంబంధం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం. లాభాలు ఆర్జించడం చేస్తున్నారు. నిజానికి జియోను ప్రారంభించాక.. దానిపైనే ముఖేష్ అంబానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టారు.

షేర్ల విక్రయం నుంచి తీసుకున్న చర్యల వరకు.. జియో చుట్టూనే ఆలోచనలు, వ్యాపార వ్యూహాలు కనిపించాయ్ కూడా ! అదానీ గ్రూప్ విషయంలో అలా కాదు. బొగ్గు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, సోలార్ ప్రాజెక్టులు.. ఇలా ఒక రంగానికి ఇంకో రంగంతో సంబంధం లేకుండా తన వ్యాపారాన్ని విస్తరించుకుకుంటూ వెళ్లారు. లాభాల బాటలో నడిచారు.

ఒకదానికి.. ఇంకోదానికి సంబంధం లేదు. ఒకేసారి రకరకాల వ్యాపారాలు. అన్నింట్లోనూ సూపర్ సక్సెస్. అదానీకి ఇదంతా ఎలాసాధ్యం అవుతోంది. ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఏపీని తన వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకునేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు రచిస్తోందా ? అంటే అవుననే సమాధానాలు కనిపిస్తున్నాయి.

తూర్పు తీరంపై దృష్టిసారించిన అదానీ గ్రూప్.. ఒక్కో పోర్టును ఇప్పుడు గూటికి చేర్చుకుంటోంది. కృష్ణపట్నాన్ని ఇప్పటికే సొంతం చేసుకున్న సంస్థ.. ఇప్పుడు గంగవరంలోనూ మెజారిటీ వాటాలు దక్కించుకుంది. తూర్పు తీరంలో పాగా వేసేందుకు మరిన్ని లక్ష్యాలతో ముందుకు అడుగులు వేస్తోంది.

దేశంలోనే అతిపెద్ద పోర్టుగా గుర్తింపు ఉన్న ముంద్రా పోర్టు కూడా ఈ సంస్థదే ! అదానీల సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఈ పోర్టు ఉంది. 2006లో పది మిలియన్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఒక పోర్టుకు అధిపతిగా ఉన్న అదానీ.. ఇప్పుడు 498 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 12పోర్టుల అధిపతిగా అవతరించారు. మరే వ్యాపారవేత్తకు.. సంస్థకు దక్కని గౌరవం ఇప్పుడు అదానీ సంస్థ గ్రూప్, యజమానికి సొంతం చేసుకున్నారు.

ఏపీలో పోర్టులు.. తెలంగాణలో సోలార్ ప్రాజెక్టులు..మధ్యలో ఎయిర్‌పోర్టులు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు..ఉన్న ప్రతీమార్గాన్ని ఫాలో అవుతోంది అదానీ గ్రూప్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద దృష్టి సారిస్తోంది. ఇంతకీ అదానీ గ్రూప్ వ్యాపార వ్యూహాలు ఏంటి?

తూర్పు తీరంలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు వ్యూహాలు వడివడిగా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును దక్కించుకున్న ఆ సంస్థ.. ఇప్పుడు గంగవరాన్ని కూడా తమ గూటికి చేర్చుకుంది. దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో అదానీ సంస్థకు పోర్టులు ఉన్నాయ్. ఇప్పుడు ఏపీలోనే అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద పోర్డు గంగవరంలో అదానీ గ్రూపు చేతిలోకి మేజర్ వాటాలు వచ్చి చేరాయ్.

భారత్‌లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా తమ సంస్థను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్.. డీవీఎస్ రాజు ఆయన కుటుంబం నుంచి వాటాలు కొనుగోలు చేసేందుకు డీల్ సెట్ చేసుకుంది. గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు తమ సొంతం కానున్నట్లు అదానీ గ్రూపు ప్రకటించింది. డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటా కొనుగోలుకు 3వేల 604 కోట్ల ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలో 31.5 శాతం వాటాను వెయ్యి 954 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ పోర్టు కంపెనీలో అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌ వాటా 89.6 శాతానికి చేరనుంది. దీంతో పోర్టుకు సంబంధించి మేజర్ షేర్లు సంపాదించగలిగింది.

విశాఖ సమీపంలో ఉన్న గంగవరం పోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లోని రెండో అతిపెద్ద నాన్‌ మేజర్‌ పోర్టు. దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్లో అయినా సరకు రవాణా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఈ పోర్టుకు ఉంది. బాగా లోతైన పోర్టు కావటంతో 2లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్‌ కేప్‌ సైజ్‌ ఓడలూ వచ్చిపోగలవు. దాదాపు 18వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పోర్టులో 9 బెర్తులు ఉన్నాయి.

బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు, దిగుమతులు పెద్దఎత్తున సాగుతున్నాయి. తూర్పు, పడమర, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరకు రవాణా సాగుతోంది. ఇలాంటి పోర్టుకు దక్కించుకున్న అదానీ గ్రూపు… వ్యాపారల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధం అవుతోంది.

గంగవరం పోర్టు కంపెనీ జారీ మూలధనం 51.70 కోట్ల షేర్లు. ఇందులో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాటా 10.4 శాతం కాగా, వార్‌బర్గ్‌ పింకస్‌ చేతిలో ఉన్న 31.5 శాతం వాటాను అదానీ పోర్ట్స్ ఇప్పటికే కొనేసింది. ఇప్పుడు డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబ వాటాల కొనుగోలుతే.. 89.6 శాతం వాటా అదానీ గ్రూపు చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వ వాటా అలానే కొనసాగనుంది. గంగవరం పోర్టు అదానీ చేతికెళ్లడం మంచిదేనంటున్న ఏపీ సర్కార్… పెట్టుబడులు మరిన్ని రావడానికి ఇది ఉపయోగపడుతుందని అంటోంది.

ఇక ఇంతకుముందు ఏపీలోని అతిపెద్ద ప్రైవేటు పోర్టు అయిన కృష్ణపట్నాన్ని కూడా అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. నవయుగ సంస్థకు చెందిన 75శాతం వాటాలను అదానీ గ్రూప్‌నకు బదిలీ చేశారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణపట్నం వ్యవహారంపై ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే.. ఇప్పుడు గంగవరాన్ని దక్కించుకుంది అదానీ గ్రూప్.

తీరంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న పట్టుదలతో దూసుకుపోతోన్న అదానీ గ్రూప్.. ఏపీపై ప్రముఖంగా దృష్టిసారిస్తోంది. ఇక పెట్టుబడులు, కొనుగోళ్లతో తెలంగాణలోనూ ఇప్పుడు పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దూకుడు సాటెవ్వరు అన్న రేంజ్‌లో సాగుతోంది అదానీ గ్రూప్స్ తీరు.

పోర్టుల మీద అదానీ గ్రూపు ఎక్కువగా దృష్టిసారిస్తోంది. సముద్ర తీర ప్రాంతం అనేది ఏ రాష్ట్రానికైనా వరంలాంటిది. వ్యాపార అవకాశాలు పెరిగి.. అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తుంటాయ్. అందుకే ఇప్పుడు పోర్టుల మీద కన్నేసింది అదానీ గ్రూప్. ఒక్కొక్కటిగా వరుసగా దక్కించుకుంటోంది. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలకు అనువైన తూర్పు తీరంపై కన్నేసింది.

ఇప్పుడు గంగవరం పోర్టును కూడా దక్కించుకుంటే దేశానికి తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సముద్రతీరంలో.. అదానీ పోర్ట్స్‌ అత్యంత క్రియాశీల సంస్థగా అవిర్భవించినట్లుగా అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందం కుదరగా.. తీర ప్రాంత వ్యాపారాల్లో సత్తా చాటాలన్న అదానీ గ్రూప్ కల అతి త్వరలోనే నెరవేరడం ఖాయం.

దేశవ్యాప్తంగా మొత్తం 12 పోర్టులను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. గత నెలలో మహారాష్ట్రలోని డిఘి పోర్టును కొనుగోలు చేసిన అదానీ సంస్థ.. ఇప్పుడు గంగవరం కొనుగోలుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పోర్ట్‌ అండ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ నిర్మాణంలో భాగంగా గంగవరం పోర్టు కొనుగోలు చేస్తున్నామని ప్రకటించింది.

గంగవరం పోర్టు.. ఏపీలోని రెండో అతిపెద్ద నాన్ మేజర్‌ పోర్ట్. ప్రస్తుతం 9 బెర్తులున్నాయి ఇక్కడ ! ఐతే ఈ సామర్థ్యాన్ని 31బెర్తులతో, ఏటా 25 కోట్ల టన్నుల సరకు రవాణా చేయగలిగేలా విస్తరించేందుకు మాస్టర్‌ప్లాన్‌ కూడా సిద్ధంగా ఉంది. 2019-20లో 3 కోట్ల 45 లక్షల టన్నుల సరకు రవాణాతో వెయ్యీ 82 కోట్ల ఆదాయాన్ని గంగవరం పోర్ట్‌ కంపెనీ నమోదు చేసింది.

వడ్డీ, పన్నులు, రుణ విమోచనకు ముందు ఆదాయం 634 కోట్లుగా ఉంది. నికరలాభం 516 కోట్లు. కంపెనీకి అప్పు లేకపోగా, 5వందల కోట్ల రూపాయల నగదు నిల్వ ఉంది. ఇలాంటి పోర్టును ఇప్పుడు అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఆ సంస్థ చేతికి పోర్టు దక్కడంతో పెట్టుబడులు మరింత పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గంగవరం పోర్టు అతి దగ్గరగా ఉంటుంది. దీని సామర్థ్యం 64మిలియన్ టన్నులు. అన్ని సీజన్లలో రవాణాకు ఈ పోర్టు అనుకూలంగా ఉంటుంది. దేశీయంగానే కాదు.. పొరుగు దేశాల్లోనూ పోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది అదానీ గ్రూప్.

ఇటీవలే శ్రీలంక ప్రభుత్వంతోనూ ఒప్పందం చేసుకుంది. కొలంబో పోర్టుకు సంబంధించి వెస్ట్ కంటెయినర్‌ టెర్మినల్‌ను నిర్మించి… 35 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు శ్రీలంక పోర్టు అధారిటీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇలా తీర ప్రాంతంలో వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది అదానీ గ్రూప్. ఇక మన దగ్గర గంగవరం పోర్టులో మేజర్ వాటాలు దక్కించుకున్న వేళ.. సంస్థ కార్యకలాపాలు మరింత దూకుడుగా కనిపించడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

ఏపీలో పోర్టుల విషయంలోనే కాదు.. తెలంగాణలోనూ పెట్టుబడులు, వ్యాపారాల విషయంలో అదానీ గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌.. తెలంగాణలోని 50 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును దక్కించుకుంది.

కెనడాకు చెందిన స్కైపవర్‌ గ్లోబల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో 50మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును… ఓ స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ద్వారా టోరంటో కేంద్రంగా నడుస్తున్న స్కైపవర్‌ గ్లోబల్‌ నిర్వహిస్తోంది. 2017 అక్టోబర్‌లో దీన్ని ఏర్పాటు చేయగా, తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీతో దీర్ఘకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కూడా చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్‌ దక్కించుకోనుంది.

తెలంగాణలో సోలార్ ప్రాజెక్టుతో తమ రెన్యువబుల్‌ ఎనర్జీ విభాగం మరింత స్ట్ర్రాంగ్ అవుతుందని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. 2025 నాటికి 25గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకెళ్తుండగా.. ప్రస్తుతం 14.86 గిగావాట్ల రెన్యువబుల్‌ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

పోర్టులు, సోలార్ ప్రాజెక్టులు మాత్రమే కాదు.. ఎయిర్‌పోర్టులపై కూడా దృష్టిసారించిన అదానీ గ్రూప్.. అందులోనూ తమ వ్యాపార సామ్రాజాన్ని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తోంది. 2019లో ఆరు విమానాశ్రయాలకు కేంద్రం వేలం నిర్వహించగా.. అన్నింటిని అదానీ గ్రూపే దక్కించుకుంది.

ముంబై విమానాశ్రయంలోనూ 76శాతం వాటా అదానీ గ్రూప్ సొంతం. ప్రైవేటీకరణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 13ఎయిర్‌పోర్టులు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుండగా.. వాటిని కూడా దక్కించుకునేందుకు ఇప్పటినుంచే అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది.

2021లో నికరంగా ఆదాయం పెంచుకున్న వారిలో అదానీనే ముందున్నారు. మొత్తం సంపదలో ఇతరులు ఎక్కువగానే ఉండొచ్చు. ఈ ఏడాది పెంపుదలలో మాత్రం జెఫ్‌బెజోస్‌నూ, ఎలాన్‌ మస్క్‌నూ కూడా అదానీ దాటేశారు. ఆయన కంపెనీ షేర్లలో ఒకటి తప్ప మిగిలినవన్నీ యాభై శాతానికి పైగా పెరిగాయ్. భారతదేశంలో అతిసంపన్నుడైన రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి కూడా ఈ ఏడాదిలో అదనంగా చేరింది 800 కోట్లడాలర్లు కాగా.. అదానీకి ఏకంగా 3వేల 580 కోట్ల డాలర్లు కొత్తగా సమకూరాయ్.

గనులు, రేవు, విమానాశ్రయాలు, విద్యుత్‌ కేంద్రాలు, డేటాసెంటర్లు దేన్నీ వదకుండా అదానీ తన పట్టు కొనసాగించారు. ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సక్సెస్‌ఫుల్ అనిపించారు. ఐతే ఇప్పుడు వ్యాపార అభివృద్ధి సమృద్ధిగా అవకాశాలు ఉన్న తీర ప్రాంత వ్యాపారంపై మరింత దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు తీరంలో పాగా వేసి… అంతకుమించి అనిపించేందుకు సిద్ధం అవుతున్నారు.

మార్కెట్‌ అప్ అండ్ డౌన్స్ ప్రభావం పెద్దగా కనిపించని రంగాల పైనే అదానీ ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. వ్యాపార విస్తరణ వెనక కారణం కూడా ఇదే అంటున్నారు. డేటా సెంటర్లలోనూ ఎంటర్ అయ్యారు. దీంతో సాంకేతికంగానూ దూసుకుపోవచ్చని.. ఇందులో కష్టం కన్నా లాభం ఎక్కువ ఉండవచ్చన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

అదానీ చేపట్టిన ప్రతీ వ్యాపారం లాభాల బాటలోనే నడుస్తోంది. అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది 96శాతం పెరిగింది. అదానీ ట్రాన్స్‌‌మిషన్‌ లిమిటెడ్‌ 79శాతం పెరిగింది. మొట్టమొదటిసంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 90శాతం వృద్ధి సాధించింది. ఇక అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ జోన్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది 52శాతం విస్తరించింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ గత ఏడాది 5రెట్లు పెరిగి 12శాతానికి చేరుకుంది.

విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు.. నిన్న కృష్ణపట్నం ఇప్పుడు గంగవరం పోర్టులను దక్కించుకోవడం వెనక లెక్క తీస్తే.. ఏపీని వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకునేందుకు అదానీలు ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకొస్తోందని.. ఆ దిశగా ప్రభుత్వంతోనూ చర్చలు కూడా జరుపుతోందన్న ప్రచారం జరిగింది.

ఎక్కడైనా అవకాశం ఉంటే అడ్రస్ కనుక్కొని వెళ్లి మరీ.. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే రకం అదానీ. అందుకే అందుకోవాలన్న ఆలోచన రావడానికి కూడా ఆలోచించే స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తన మార్క్ వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల రంగంలో 50వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా అదానీ ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది.

అదృష్టమైనా, మంచి అవకాశమైనా జీవితంలో ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది అంటారు కదా ! అలా తలుపు తట్టడానికి ముందే ఆ అవకాశాన్ని అందుకోవడంలో అదానీ దిట్ట ! దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడన్నట్లు.. పదేళ్ల ట్రెండ్‌ను ముందే పసిగట్టి పెట్టుబడులు, వ్యాపారాలు మొదలుపెట్టారు అదానీ. ప్రతీ దాంట్లోనూ విజయాన్నే తన సంతకంగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎవరూ అందుకోలేని స్థాయిలో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఒక్కడిగా.. కోట్లాది మందిలో ఒక్కడిలా ఎదుగుతూ.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారాయన!

ఆర్థిక అభివృద్ధిలో పోర్టులో కీలక పాత్ర పోషిస్తాయని ముందుగానే ఊహించిన అదానీ.. అందులో పెట్టుబడులకు పెద్ద పీట వేశారు. ప్రత్యేకంగా ఓ కంపెనీ ఏర్పాటు చేసి.. ఒక్కొక్కటిగా కొనుగోలు చేస్తున్నారు. ముంద్రా పోర్టు నుంచి ఇప్పుడు గంగవరం వరకు.. ఆయన అనుసరించిన విధానం ఇదే! ఇలా ముందుగా అంచనా వేసే తత్వమే ఆయనను సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌గా చేసింది. ఆ గుణమే ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 పోర్టులకు యజమానిని చేసింది.

దేశవిదేశాల్లోనూ కొత్త నౌకాశ్రయాలు నిర్మించి స్థాయిలో ఆయనను కూర్చోబెట్టింది. ఇప్పుడు డేటా సెంటర్ల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో భవిష్యత్‌‍లో అదానీ గ్రూప్ మరిన్ని లాభాల బాటపట్టడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయ్. అదానీ సంపాదన సంగతి ఎలా ఉన్నా.. ఆయన వ్యాపారంలో ఓ ఘట్టం మాత్రం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

తెలుగు వారి నుంచే ఆయన ఎక్కువగా వ్యాపారాలను కొనుగోలు చేస్తున్నారు. ముంబై విమానాశ్రయానికి సంబంధించి జీవీకే నుంచి.. కృష్ణపట్నంలో నవయుగ సంస్థ నుంచి.. ఇప్పుడు గంగవరం పోర్టులో డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబసభ్యుల నుంచి వాటాలు కొనుగోలు చేశారు. యాదృచ్ఛికంగా జరిగిందో లేదో గానీ.. ఇది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోందిప్పుడు !