Site icon 10TV Telugu

ఈ ఏడాది ఇప్పటివరకు గోల్డ్ ధర ఎంత పెరిగిందో తెలుసా? గత నెల ఏం జరిగిందంటే? ఇప్పుడు కొంటే లాభమా?

Gold

Gold

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు జూలైలో 0.3 శాతం పెరిగి USD 3,299 వద్ద నిలిచాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తెలిపింది. 2025లో ఇప్పటివరకు బంగారం ధరలు 26 శాతం పెరిగాయి.

బంగారం ధరల బలానికి గ్లోబల్‌గా ద్రవ్యోల్బణ అంచనాల పెరుగుదల, టారిఫ్‌ ఉద్రిక్తతలు సానుకూల ప్రభావం చూపాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌ల ప్రణాళిక, కౌంటర్‌-టారిఫ్‌లు అంతర్జాతీయ బంగారం ధరలకు ఊతమిచ్చాయని నివేదికలో పేర్కొంది.

“మోమెంటం ఫ్యాక్టర్లు కూడా సానుకూలంగా ప్రభావం చూపించాయి. కానీ అమెరికా డాలర్‌ జూలైలో లాభాలపై తీవ్రమైన ఒత్తిడి చూపించింది” అని నివేదిక పేర్కొంది. జూలైలో గ్లోబల్‌ గోల్డ్‌ ETFs (ఎక్స్చేంజ్‌ ట్రేడ్‌ ఫండ్స్‌)లో పెట్టుబడులు కొనసాగాయి. వీటిలో ఉత్తర అమెరికా, యూరప్‌ ఆధిపత్యం చూపగా, ఆసియా, ఇతర ప్రాంతాల్లో స్వల్పంగా పెట్టుబడులు వచ్చాయి.

Also Read: ఢిల్లీలో భారీ వర్షం.. గోడ కూలి 8 మంది మృతి

భారత్‌ విషయానికి వస్తే బంగారం మార్కెట్‌, స్పాట్‌ గోల్డ్‌ ధరలు సుమారు రూ.4,000 పెరిగి 10 గ్రాములకు రూ.1,03,825కి చేరాయి. భారత్‌లో బంగారం ధరలు జూన్‌లో 10 గ్రాములకు రూ.లక్ష మార్క్‌ను దాటాయి. దేశీయ కరెన్సీ బలహీనత, సేఫ్‌-హావెన్‌ డిమాండ్‌ పెరుగుదల బంగారం ధరలు అధికం కావడానికి కారణమయ్యాయి.

అక్టోబర్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ధరలు భారత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ (MCX)లో 10 గ్రాములకు రూ.1,02,047 వద్ద ట్రేడవుతున్నాయి. మొత్తానికి 2025లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల వినియోగదారులు స్వల్పకాలంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం లేదా లోహంలో పెట్టుబడి పెట్టడం మానేస్తున్నారు.

ఒక ప్రముఖ బంగారు ఆభరణాల చెయిన్‌ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పసిడి ధరలు పెరగడం వల్ల వినియోగదారులు 22 క్యారెట్‌ బంగారు ఆభరణాలు కాకుండా 18 క్యారెట్‌ ఆభరణాలు కొనడంపై ఆసక్తి చూపుతున్నారు.

Exit mobile version