శంషాబాద్ ఎయిర్ పోర్టులో GMR బిజినెస్‌ పార్క్‌ 

  • Publish Date - May 11, 2019 / 04:40 AM IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న మిగులు స్థలంలో ’బిజినెస్‌ పార్క్‌’ ఏర్పాటు చేయాలని జీఎంఆర్‌  హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయిర్  పోర్టులో మిగులుగా ఉన్న భూమిని ఆదాయ వనరుగా మార్చుకునే క్రమంలో… సుమారు రూ.350 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు జీఎంఆర్‌ గ్రూప్  అభివృద్ధి విభాగం సీఈవో అమన్‌ కపూర్ చెప్పారు. ఇందులో దాదాపు పది లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌తో ఆరు భవంతులు నిర్మించనున్నారు.

ఇప్పటికే ఒక టవర్‌ నిర్మాణం పూర్తయ్యిందని, దీనిలో కొంత భాగంలో జీఎంఆర్‌ గ్రూప్‌ సంస్థ ఒకటి కార్యకలాపాలు సాగిస్తోందని అమన్‌ వివరించారు. రాగల 2,3 ఏళ్ళలో మొత్తం ప్రాజెక్టు పూర్తయి, అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.  బిజినెస్ పార్క్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణలో కొంతభాగం అంతర్గత వనరుల ద్వారా, మిగతాది రుణాల ద్వారా సమీకరిస్తున్నట్లు చెప్పారు. త్వరలో సిద్ధమయ్యే రెండో టవర్‌లో ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకిచ్చేందుకు పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని జీఎంఆర్‌ వర్గాలు తెలిపాయి.