Gold Price Prediction
Gold Price Prediction: బంగారం ధర భారీగా పెరుగుతోంది. రోజురోజుకు తులం గోల్డ్‌పై వేలల్లో పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. రాబోయే కాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే.. రెండేళ్లలో తులం బంగారం ధర రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ.1.30లక్షలకు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ.1.25లక్షలకు చేరింది. 2025 జనవరి నెల నుంచి 67శాతం గోల్డ్ రేటు పెరిగింది. ఈ ఏడాదిలో బంగారం ధరల్లో ఈ పెరుగుదల స్టాక్ మార్కెట్లను కూడా అధిగమించింది. దీంతో పెట్టుబడిదారుల్లో బంగారం ధరలు ఏ స్థాయికి చేరుకుంటుందనే చర్చమొదలైంది. ఇదే పరిస్థితి ఉంటే గోల్డ్ రేటు రూ.3లక్షలకు చేరడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Gold Dhanteras 2025 : బాబోయ్.. 60వేల కోట్ల బంగారాన్ని కొన్నారు..! గతేడాది కంటే 25శాతం ఎక్కువ..
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. దేశాల మధ్య ఉద్రిక్తతలకుతోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పెంపు, వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేట్లు, ప్రజల్లో కొనుగోలు ఆసక్తి పెరగడం, అలాగే ధరలు పెరుగుతున్న సమయంలో ఇంకా ఎక్కువ మంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతారు. ఇదికూడా ధరలు పెరిగేందుకు మరింత బలాన్ని ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా సంక్షోభ, అనిశ్చితి పరిస్థితుల్లో.. ఆర్థిక వ్యవస్థ భద్రత కోసం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (మన దగ్గర ఆర్బీఐ), సంస్థలు తమ డాలర్ బాండ్స్‌లో పెట్టుబడులు తగ్గించి.. బంగారం నిల్వల్ని భారీగా పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది పోలాండ్, కజకిస్తాన్, చైనా, టర్కీ వంటి దేశాలు చాలా ఎక్కువగా బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి. అయితే, ఈ దేశాలు అన్నికలిసి 70టన్నులకు పైగా బంగారాన్ని కొన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అస్థిరత ఇలాగే కొనసాగితే 2026-2027 నాటికి కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు తగ్గాలంటే.. రష్యా – యుక్రెయిన్ యుద్ధం పూర్తిగా ఆగిపోవాలి. ట్రంప్ సుంకాల ప్రభావం, ఆర్థిక మందగమనంపై స్పష్టత రావాలి. డాలర్ మళ్లీ పుంజుకోవాలి. డాలర్ విలువ పెరిగితే అప్పుడు డిమాండ్ అటు పెరిగి బంగారం ధర తగ్గు అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను తగ్గించాల్సి ఉంటుంది. పై అంశాల్లో సానుకూల ఫలితాలు వస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ధరలు అమాంతం తగ్గే పరిస్థితులు లేవని, ఒకవేళ అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినా బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావాలంటే చాలా సమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.