Gold : బాబోయ్.. 60వేల కోట్ల బంగారాన్ని కొన్నారు..! గతేడాది కంటే 25శాతం ఎక్కువ..
Gold భారీ స్థాయిలో గోల్డ్ రేట్లు పెరిగినప్పటికీ.. బంగారం కొనుగోలు విషయంలో భారతీయులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.

Gold
Gold : ధంతేరస్ (ధనత్రయోదశి) సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం మహిళలు శుభకరంగా భావిస్తారు. ఈ పండుగ రోజును ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడికి, ఇంటికి శుభకరంగా భావిస్తారు. చిన్న బంగారు నాణెం లేదా పెద్ద ఆభరణం అయినా ధనత్రయోదశి రోజున కొనుగోలు చేయడం ఒక శ్రేయస్కర చర్యగా పరిగణిస్తారు. అయితే, శనివారం (అక్టోబర్ 18) ధనత్రయోదశిని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బంగారం కోసం కోట్లు వెచ్చించారు.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీరోజూ వందలు, వేలల్లో పెరుగుతూ ఆకాశమే హద్దుగా గోల్డ్ ధరలు దూసుకెళ్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం 10గ్రాముల 24 క్యారట్ల బంగారం రేటు రూ.1.30లక్షలకు చేరగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1.20 లక్షలకు చేరింది. దీంతో గోల్డ్ పేరు వింటేనే మధ్య తరగతి వర్గాల ప్రజలతోపాటు ధనిక వర్గాల ప్రజలుసైతం ఉలిక్కిపడుతున్నారు.
Also Read: Gold Price Today : దీపావళి వేళ గోల్డ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
భారీ స్థాయిలో గోల్డ్ రేట్లు పెరిగినప్పటికీ.. బంగారం కొనుగోలు విషయంలో భారతీయులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. శనివారం ధనత్రయోదశి రోజును దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేశారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా ప్రకారం.. ధనత్రయోదశి రోజున దేశ ప్రజలు బంగారాన్ని భారీ మొత్తంలో కొనుగోలు చేశారు. సుమారు 60,000 కోట్ల రూపాయలు వీటికోసం దేశ ప్రజలు ఖర్చు చేసినట్లు సీఏఐటీ అంచనా వేసింది.
ఒక్క ఢిల్లీ బులియన్ మార్కెట్లో మాత్రమే రూ. 10వేల కోట్లకుపైగా అమ్మకాలు నమోదయ్యాయని తెలిపింది. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 25శాతం ఎక్కువ అని తెలిపింది.
ధంతేరస్, దీపావళి సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదమని చాలా మంది ప్రజలు భావిస్తారు. ప్రతీయేటా ఈ సమయాల్లో బంగారం, వెండి కొనుగోళ్లు చేస్తారు. అయితే, బంగారం అమ్మకాలతోపాటు వెండి అమ్మకాలుసైతం భారీగానే జరిగాయట. కేజీ వెండి రేటు రూ.2లక్షలు దాటేసింది. గతేడాది రేటు కంటే 55శాతం పెరిగింది. అయినా ధనత్రయోదశి సందర్భంగా వెండిని ప్రజలు పెద్దెత్తున కొనుగోళ్లు జరిపినట్లు సీఏఐటీ పేర్కొంది.
బంగారం, వెండి అమ్మకాలే కాకుండా.. వంట సామాగ్రి అమ్మకాలు రూ.15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు రూ.10,000 కోట్లు, అలంకరణ.. మతపరమైన వస్తువుల అమ్మకాలు రూ.3,000 కోట్లుగా ఉన్నాయని వ్యాపారుల సంఘం తెలిపింది.