Gold Price Prediction
Gold Price Prediction: బంగారం ధరలు మండిపోతున్నాయి. కరోనా విపత్తు నుంచి మొదలైన పుత్తడి ధరల పెరుగుదల.. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఆకాశమే హద్దు అన్న రీతిలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను బంగారం ధరలు నమోదు చేస్తున్నాయి. మరోవైపు వెండి ధరలుసైతం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది పసిడి ధర 50శాతం, వెండి ధర 55శాతం చొప్పున పెరిగాయి.
2005లో 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.7వేలు వద్ద ఉంది. 2010 నాటికి రూ.18,500కు పెరిగింది. 2015లో రూ.26,300 వద్దకు చేరింది. 2025 సెప్టెంబర్‌లో రూ.1,18,000కు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టులో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 36శాతం పెరిగాయి. ఈ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే దీర్ఘకాలంలో బంగారం బలంగా నిలబడుతుందని ఆనంద్‌రాఠి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ కమోడిటీ విభాగం ఏవీపీ మనీష్ శర్మ చెప్పారు.
ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో పసిడి, వెండి సరికొత్త జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. సోమవారం 10గ్రాముల పసిడి ధర రూ.1,18,900 స్థాయికి చేరింది. డాలర్ తో రూపాయి బలహీనత నేపథ్యంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,39,600 స్థాయికి చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధరల దూకుడును చూస్తుంటే.. వచ్చే ఏడాది కాలంలో బంగారం ధరలు 15 నుంచి 20శాతం పెరొగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోతను కొనసాగిస్తే, డాలర్ బలహీన పడుతుంది. ఇది బంగారం ధరలు పెరిగేందుకు మద్దతునిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1.50లక్షలకు చేరుకొనే అవకాశం ఉందని, 2026 మధ్య నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4వేల డాలర్లను అధిగమించొచ్చునని.. వచ్చే మూడు నాలుగేళ్లలో 5వేల డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026లో తులం గోల్డ్ రేటు రూ.2లక్షలు అవుతుందని, వచ్చే ఏడాది చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.